గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 28 మే 2015 (07:53 IST)

నమో... లోకేషాయనమ:... లోకేష్ కు కీలక బాధ్యతలు..?

మహానాడులో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. చాలా మంది నాయకులు లోకేష్ జపం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబును మించి లోకేష్ జపం చేసిన వారే అధికంగా ఉన్నారంటే ఆశ్చర్యం అక్కరలేదు. మహానాడులో ఎటు చూసినా లోకేష్ జపమే వినిపించింది. ఆయన భజనే కనిపించిందని చెప్పాలి. ఆయన కీలక స్థానంలోకి రానున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అది ఏదనే విషయం అలా ఉంచితే, మహానాడులో ఆయనను కలిసేవారు.. ఆయన కలిసేవారిని చూస్తే రాబోవు రోజుల్లో లోకేషే కీలకమని తెలుస్తోంది. సామాన్య కార్యకర్త నుంచి సీనియర్ల వరకూ అందరూ లోకేష్ నామ జపమే. 
 
తొలిరోజు పార్టీ అధ్యక్షుని ప్రసంగం తర్వాత తొలి చర్చ సంక్షేమ నిధి కార్యక్రమాలపైనే జరిగింది. ఈ సందర్భంగా ఏడాదిలో తాము చేసిన వివిధ కార్యక్రమాలను లోకేశ్‌ వివరించారు.  ఆ తర్వాత మాట్లాడిన పార్టీ సీనియర్‌ నేతలు కళా వెంకట్రావు, పెద్దిరెడ్డి ఈసారి పార్టీ సభ్యత్వం అరకోటికి చేరుకోవడంలో లోకేశ్‌ పాత్రను ప్రశంసించారు. లోకేశ్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవాలంటూ మహానాడు వేదికపై నుంచే రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేశారు. ‘‘పార్టీ అధ్యక్షునిగా, సీఎంగా మీపై ఎన్నో బాధ్యతలున్నాయి. మీరు కొత్త రాజధానిని నిర్మించాల్సి ఉంది. మీకు సమయం సరిపోవడం లేదు. పార్టీకి సంబంధించి కొన్ని బాధ్యతలను మీరు లోకేశ్‌కు అప్పగిస్తే బాగుంటుంది’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
చంద్రబాబు పాదయాత్ర సమయంలో లోకేశ్‌ కృషిని, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరితే లోకేశ్‌ తిరస్కరించడాన్ని ఆయన గుర్తు చేశారు. గరికపాటి విజ్ఞప్తిపై బాబు ఏ స్పంద నా వ్యక్తం చేయలేదు. కానీ, ఈసారి పార్టీ సభ్యత్వా న్ని బాగా చేయడంపై మాత్రం పార్టీ నేతలందరినీ మెచ్చుకొన్నారు. లోకేశ్‌ కృషికి ప్రశంసలు లభించడం ఆయన పాత్ర పెరగబోతోందన్న దానికి సూచికని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో పార్టీ నియామకాల్లో ప్రధాన కార్యదర్శుల్లో ఒకరుగా ఆయనను నియమించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.