గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: గురువారం, 31 జులై 2014 (16:42 IST)

బాబు పేషీలో చినబాబు వేలు... కక్కలేక మింగలేక మంత్రులు...

చంద్రబాబు పాలనలో చినబాబు లోకేష్ పట్టు పెంచుకుంటున్నారు. ఇప్పటికే సి.ఎం.వో ఆఫీసులో తన మిత్రుడు అభీష్టను పెట్టి పరిపాలన అంశాలను సేకరించుకుంటున్న లోకేష్ తాజాగా ఇప్పడు మంత్రులు పేషీల మీద దృష్టి సారించారు. అందులోభాగంగా ఆయన మంత్రుల వద్ద ఉండే వ్యక్తిగత కార్యదర్శులను, పిఆర్ఓలను ఆయనే నియమిస్తున్నారన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది.
 
కేవలం తొలిసారి మంత్రి పదవి చేపట్టిన వారు సంగతి అటుంచితే సీనియర్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడు సైతం, ఉప ముఖ్యమంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, చినరాజప్పలు సైతం లోకేష్ సూచనల మేర  నడుచుకోక తప్పడం లేదట. ఆర్థికమంత్రి యనమల వద్ద ఉన్న ఓ. ఎస్.డి ప్రత్యేకాధికారి శ్రీనివాసరావును మార్చాల్సిందేనని సందేశం పంపిచారట. గతంలో కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి వద్ద ఆయన పనిచేయడమే ఇందుకు కారణమని చెపుతున్నారు.
 
లోకేష్ మాటతో ఆయన తప్పనిసరి పరిస్థితిలో తన అధికారిని మార్చుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి కూడా చాలా సీనియర్. ఆయన వద్ద ఉన్న పాత అధికారి గోపాలాన్ని కూడా తొలగించక తప్పలేదు. వ్యవసాయ మంత్రి పుల్లారావు నియమించుకున్న సుబ్బరాజును కూడా గతంలో దానం నాగేందర్ వద్ద పని చేశారన్న కారణంతో తప్పించారు. అయితే విశేషం ఏమిటంటే వీరంతా అంతకుముందు టిడిపి హయాంలో మంత్రుల వద్ద పనిచేసినవారే కావడం. అయినా ఇప్పుడు ఒప్పుకోవడం లేదు.
 
లోకేష్ ఆయా మంత్రుల వద్ద కార్యదర్శులుగా నియమించేవారి జాబితాను క్లియర్ చేసి ముఖ్యమంత్రి పేషీలో ఉన్న తన స్నేహితుడు అభీష్ట వద్దకు పంపుతారనీ, అక్కడ నుంచి మంత్రులకు సమాచారం ఇస్తారని సమాచారం. ఆయా మంత్రులు పిఆర్వోలుగా సొంత మనుషులను పెట్టుకోబోయినా అంగీకరించడం లేదని తెలిసింది. ఎన్.టి.ఆర్.ట్రస్టు భవన్ లో పనిచేసినవారినే పెట్టుకోవాలని లోకేష్ జాబితా సిద్ధం చేస్తున్నారట.
 
హోం మంత్రి చినరాజప్ప తనకు తెలిసిన జర్నలిస్టు ఒకరిని పిఆర్ఓగా పెట్టుకోబోగా అనుమతించలేదట. పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న శ్రీనివాసరావును నియమించుకోవాలని లోకేష్ సూచించారట. పార్టీ ఆఫీసుల్లో పనిచేసిన వారినే పి.ఆర్.ఓ లుగా నియమించుకోవాలని మంత్రులకు సూచిస్తున్నారంట లోకేష్. రాబొయే కాలనికి చినబాబు లైన్ వేస్తున్నారని అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సీనియర్ మంత్రుల పేషీలోనూ చినబాబు వేలు పెడతుండటంతో కక్కమింగ లేక ఉన్నారట సీనియర్ మంత్రులు