గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 29 జులై 2016 (18:53 IST)

బంద‌రు భెల్ కంపెనీ కూడా త‌ర‌లిపోతోంద‌ట‌...

విజయవాడ: ఒక‌ప్పుడు వైభవంగా వెలుగొందిన కృష్ణ జిల్లా కేంద్రం మచిలీపట్నం... నేడు ఎలా వుందంటే... ఏవి తల్లి నిరుడు కురిసిన హిమా సమూహములు అని ఓ కవి అడిగినట్లు ఉంది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఎప్పుడూ అధికారులు, వారికి విజ్ఞప్తులు చేసుకునే దర్శకులతో కిటకిటలాడుతూ ఉండేది. అయితే గత 20 ఏళ్ళ నుంచి ఈ పట్నానికి శని పట్టిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెంచ్, డచ్, బ్రిటీష్ పాలనలో వైభవంగా వెలుగొందిన ఓడ రేవు మూల‌న‌ప‌డింది. కార్యాలయం కాకినాడకు తరలింది. 
 
అలాగే మెరైన్ ఇంజనీరింగ్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఆంధ్రా బ్యాంక్ డివిజనల్ ఆఫీస్, ఆబ్కారీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, అర్టీసీ డివిజన్ ఆఫీస్ ఇలా అనేక ముఖ్యమైన కార్యాలయాలు తరలిపోయినా పట్టించుకున్నవారే లేరు. సహజంగా ఒక కార్యాలయం తేవటానికి ఎంతో కృషి చెయ్యాలి, పోరాటాలు చెయ్యాలి. ఇది ఓడరేవు కోసం పోరాటం చేసిన మచిలీపట్నం ప్రజలకు బాగా తెలుసు. అలాంటిది ఇన్ని కార్యాలయాలు తరలిపోతుంటే ప్రేక్షక పాత్ర వహించిన ఘన చరిత్ర కూడా మ‌చిలీప‌ట్నం నేత‌ల‌కే ద‌క్కుతుంది. ఫలితంగా మ‌చిలీప‌ట్నానికి బయటి నుండి వచ్చేవారే కరువయ్యారు. అసలే అరకొరగా ఉన్న కార్యాలయాలకు కూడా వారానికి అధికారులు ఒకటో ఆరో రోజు వ‌స్తున్నారు. 
 
దక్షణ భారత‌దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హీట్ సెట్టింగ్ ప్లాంట్‌కి వస్త్ర అద్దకం కోసం దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ముడి వస్త్రాలు వచ్చేవి. నీటి సరఫరా చెయ్యలేకో, లేదా కావలసినవి చెయ్యకో అంతటి ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ మూతబడింది. దాన్ని తెరిపించి కార్మికులకు ఉపాధి కాపాడాలనే ఆలోచన లేని నేత‌లున్న ఊరు మచిలీపట్నం. డంకెన్ ఫ్యాక్టరీ సోడా యాష్ ఫ్యాక్టరీ పెట్టేందుకు వస్తే వారిని తరిమేసిన ఊరు ఇదే.
 
తాజాగా దేశంలోనే ఎక్కడా లేని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రక్షణ సంస్థ అధీనంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బి ఈ.ల్) సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. తుపాకులు, ట్యాంకులకి అమర్చేందుకు, సైనికులు, సరిహద్దు భద్రత దళాలకు, సీఆర్పీ, ఆయా రాష్ట్ర పోలీసులు రాత్రివేళల్లో శత్రువుల జాడను పసికట్టి గురిచూసి లక్ష్యాన్ని ఛేదించే అత్యంత అపురూపమైన రాత్రి వేళల్లో   చూడగాలిగే నైట్ విజన్ సైట్స్ తాయారుచేసే కర్మగార‌మిది. యూనిట్ ఎక్సటెన్షన్ పేరుతో పామర్రు మండలం లోని నెమ్మలూరుకు తరలించి ప్రస్తుతం ఫ్యాక్టరీ ఉన్న ప్రదేశంలో టౌన్‌షిప్ డెవలప్ చేసే ప్రయత్నాలున్నట్లు తెలిసింది. దీనిపై బెల్ కంపెనీ ఉద్యోగులు, పట్టణం లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ బెల్‌ని గతంలో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీగా అయ్యగారి రామమూర్తి పంతులు ముందుచూపుతో నెలకొల్పిన ఈ ప్రతిష్టాత్మకమైన బెల్ తరలిపోతుందంటే పట్టణ ప్రజలు, ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ వ్యవస్థాపక సభ్యుల కుటుంబాలు, ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ తయారైన నైట్ విజన్ పరికరాల వలనే కార్గిల్‌లో ఆపరేషన్ విజయ్‌లో భారత్ విజయం సాధించింది అనేది తెలిసిందే.
 
ఇక ముఖ్యంగా ఆ పట్టణ ప్రజలు నెమ్మలూరు వద్ద వేల కోట్లు పెట్టించి ఫ్యాక్టరీ కట్టించుకున్నా అభ్యంతరం లేదు కాని, మచిలీపట్నంలో ఉన్న యూనిట్ మాత్రం యధాతధంగా వుంచి దానికున్న చరిత్రను కాపాడాలని, అలాగే అన్నివిధాలా వెనుకబడిన మచిలీపట్నంని తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు నేటి నాయకుల పైన వున్నదని, అభద్రతా భావంతో వున్న ప్రజలకు తగిన నమ్మకం కలిగే విధంగా హామీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.