గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (11:00 IST)

సాగర్ తెలంగాణ సొత్తు కాదు.. మాకూ నియంత్రణ కావాలి..!

నాగార్జున సాగర్ తెలంగాణ రాష్ట్రం సొత్తు కాదని, నియంత్రణ పూర్తిగా తెలంగాణకు ఇవ్వడం వలన తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఆరోపిస్తోంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించింది. ఉంటే బోర్డు ఆధీనం ఉండాలని లేదా నియంత్రణలో కూడా తమకు వాట ఉండాల్సిందేనని పట్టుబడుతోంది. 
 
సాగర్ కు కుడివైపున 13 గేట్లు, కుడికాల్వపై తమ నియంత్రణలో ఉండాలని లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనున్నది. సాగర్ ప్రాజెక్టు తెలంగాణ నియంత్రణలో ఉండటం వల్ల ఏపి కుడి కాల్వకు న్యాయంగా విడుదల చేయాల్సిన నీటిని ఇవ్వడం లేదని ఆరోపించింది. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయని బోర్డుకు విన్నవించనున్నారు.
 
కృష్ణా నదిలో లభ్యమయ్యే మొత్తం నీటిని లెక్కగట్టి 228.71 టీఎంసీల నీటిని తాము వాడుకోవడానికి అవకాశం ఉందంటూ తెలంగాణ చేస్తున్న వాదనలో అర్థం లేదని పేర్కొననుంది. కృష్ణా నీటి లభ్యత మొత్తాన్ని సాగర్ నుంచే తీసుకునేందుకు తెలంగాణ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దాని వలన ఆంధ్ర రైతాంగం దెబ్బ తింటుందని వాపోయారు. 
 
ప్రాజెక్టుల వారీగా నీటి వాడకాన్ని నిర్ధారించే ప్రోటోకాల్స్ రూపొందించే బాధ్యతను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం అప్పగించిందని, ఆ పని ట్రిబ్యునల్ చేస్తుందన్నారు. శ్రీశైలం ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయడం నిబంధనలకు విరుద్ధమని కృష్ణా బోర్డు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిన తెలంగాణ.. సాగర్ విషయంలో బోర్డు సమావేశం ఏర్పాటు చేసి తమకు నీటిని వాడుకొనే హక్కు కల్పించాలని కోరడం విచిత్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. తమ భూ భాగంలోని కాల్వపై తెలంగాణకు నియంత్రణ ఎందుకని ప్రశించనున్నారు.