శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:30 IST)

వైద్యుల నిర్లక్ష్యం... పాము కాటుకు వ్యక్తి మృతి

మానవత్వం మంటగలిసింది. పాము కాటుతో బాధపడుతున్న మనిషి పట్ల మానవత్వం చూపకుండా వైద్యానికి నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లి గ్రామంలో చోట

మానవత్వం మంటగలిసింది. పాము కాటుతో బాధపడుతున్న మనిషి పట్ల మానవత్వం చూపకుండా వైద్యానికి నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
అదే గ్రామానికి చెందిన మల్లేష్‌ (36)ను సోమవారం పొలం వద్ద పాము కరిచింది. బాధితుడిని కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో జిల్లా ఆస్పత్రికి ఆటోలో తీసుకొచ్చారు. ఆయన్ని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లేందుకు ఆ సమయంలో స్ట్రెచర్‌ లేదు. కనీసం వార్డు బాయ్‌ కూడా రాకపోవడంతో చాలాసేపు ఆయన్ని ఆటోలోనే ఉంచారు. తర్వాత వైద్యుణ్ని కలిసి జరిగింది చెప్పారు. రోగిని ఆస్పత్రి లోపలకు తీసుకొస్తేనే వైద్యం చేస్తానని వైద్యుడు తేల్చి చెప్పాడు. దీంతో చేసేది లేక ఆ కుటుంబంలోని మహిళలు ఆయన్ని లోపలికి తీసుకెళ్లడానికి యత్నించారు. 
 
కానీ మల్లేష్‌ బరువుగా ఉండటంతో మోసుకెళ్లలేకపోయారు. ఈ పరిస్థితుల మధ్య సుమారు గంట సమయం బాధితుడు ఆస్పత్రి బయటే ఉండిపోయాడు. అక్కడే ప్రాణాలు విడిచాడు. గంట తర్వాత స్పందించిన ఆస్పత్రి సిబ్బంది మల్లేష్‌ను లోపలకు తీసుకెళ్లి పరీక్షించారు. ఆయన మరణించినట్టు నిర్ధారించారు.

ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్యం అందించి ఉంటే తమ కుటుంబ పెద్ద ప్రాణం నిలిచేదని కుటుంబీకులు ఆసుపత్రిముందే ఆందోళనకు దిగారు. డీఆర్వో ధర్మాకర్‌, ఆర్డీవో యాదిరెడ్డి, నార్త్‌జోన్‌ ఏసీపీ ఆనంద్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించిన వైద్యుడు అరవింద్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.