శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (12:19 IST)

మజ్లిస్‌ను చూసి కాంగ్రెస్ భయపడుతోంది: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ

దేశవ్యాప్తంగా రాజకీయంగా విస్తరిస్తున్న మజ్లిస్ పార్టీని చూసి కాంగ్రెస్ భయపడుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ధీటుగా ఎంఐఎం కీలక పాత్ర పోషించనున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. బీజేపీకి, మోడీకి మస్లిస్‌ ఏజెంట్‌గా మారిందన్న ఏఐసీసీ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలను ఒవైసీ ఖండించారు. దిగ్విజయ్‌కు త్వరలో లీగల్‌ నోటీస్‌ పంపనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌ సత్తా ఏమిటో కాంగ్రెస్‌కు చాటి చెబుతామన్నారు.
 
గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పి తీరుతామని ఓవైసీ స్పష్టం చేశారు. చార్మినార్‌ సమీపంలోని ముర్గీచౌక్‌లో జరిగిన మజ్లిస్‌ మాజీ అధ్యక్షుడు ఫక్రేమిల్లత్‌ అబ్దుల్‌ వాహెబ్‌ ఒవైసీ 40వ వర్ధంతి సభలో అసదుద్దీన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ గెలుపుతో.. 1200 ఏళ్లుగా బానిసత్వంలో మగ్గిన భారతదేశానికి విముక్తి లభించిందని మోడీ చెబుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చి ఓట్లు 30 శాతం మాత్రమే. అంటే, 70 శాతం ప్రజలు బీజేపీని వ్యతిరేకించినట్టే కదా’’ అని ఓవైసీ ప్రశ్నించారు.