బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (16:50 IST)

అమ్మాయి సెల్‌ఫోన్ తెగ వాడుతోంది.. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడన్న సందేహం.. అందుకే చిరుప్రాయంలోనే పెళ్లి...

గుంటూరు జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. విద్యాపరంగా చైతన్యవంతమైన ఈ జిల్లాలో సగానికిపైగా ఈ మైనర్ వివాహాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా.. ఈ జిల్లాలో 52 శాతం మంది ఆడ పిల్లలు తమ 18వ పుట్టిన రోజు భర్త, అత్తమామలతో కలసి చేసుకుంటున్నట్లు యూనిసెఫ్‌ తాజా నివేదిక బట్టబయలు చేసింది. 
 
చిన్న వయస్సులో వివాహాలు చేసుకోవడం వల్ల ఆడపిల్లలకు ఆరోగ్యపరమైన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. పైగా ఈ వయస్సులో గర్భం ధరిస్తే కాన్పు సమయంలో, తర్వాత రక్తస్రావానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైనర్‌ గర్భిణిల్లో గుర్రపువాతం(ఎక్లాంప్సియా) ప్రమాదం కూడా అధికమే. 
 
జిల్లాలో సంభవిస్తున్న మాతృ మరణాల్లో కాన్పు అనంతరం జరిగే రక్తస్రావం, గుర్రపు వాతం తొలి రెండు స్థానాల్లో ఉండటం గమనార్హం. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్‌) పెరిగేందుకు మైనర్‌ వివాహాలు కూడా ముఖ్య కారణమని యూనిసెఫ్‌ నివేదిక స్పష్టం చేసింది. నర్సరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన పరిధిలో మైనర్ల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. 80 శాతం మైనర్‌ వివాహాలకే పల్నాడు ప్రాంతమే కేంద్రంగా నిలుస్తోంది.
 
అయితే, తమ బిడ్డలకు మైనార్టీ తీరకముందే వివాహం చేయడానికి గల కారణాలను తల్లిదండ్రులు పలు విధాలుగా చెపుతున్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయింది.. ఇంటివద్ద ఉండి ఏం చేస్తుంది. అందుకే పెళ్లి చేస్తున్నాం. పైగా అబ్బాయి తరపు వారే మమ్మల్ని సంప్రదించారు. బాగా ఆస్థిపరులు. కట్నం పెద్దగా అడగలేదు అందుకే పెళ్లి చేస్తున్నట్టు కొందరు చెపుతున్నారు. మరికొందరైతే తమ బిడ్డల ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ వాడుతోంది. బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని అనుమానంగా ఉంది. చెడ్డపేరు రాకముందే ఒక అయ్య చేతిలో పెడుతున్నామని చెప్పారు. 
 
కాలేజీకి వెళుతున్నట్లు చెప్పి రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకుని వచ్చింది. ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందనే భయంతో అందరి ముందు వివాహం చేస్తున్నాం. ఆకతాయిల వేధింపుల నుంచి రక్షించడం కష్టంగా మారింది. పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే వారిదే బాధ్యత. పైగా.. ఓ పెద్ద భారం దించుకున్నట్టు అవుతుందని ఇంకొందరు చెపుతున్నారు.