గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2015 (14:12 IST)

మొగుడిని వదిలేసిన అనిత: రోజా వ్యాఖ్యలతో అసెంబ్లీలో అనిత కన్నీరు!

తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత అసెంబ్లీ కన్నీటిపర్యంతం అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు చేయడంపై ఆమె తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. రోజా మాటలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలతో చెప్పలేని విధంగా తనను రోజా దూషించారని, ఈ కారణంగానే తాను రెండు రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని.. అనిత అసెంబ్లీ కంటతడి పెట్టారు. 
 
ఒక మహిళ అయి ఉండి కూడా సాటి మహిళపై దారుణ వ్యాఖ్యలు చేయడం అమానుషమని అనిత వెల్లడించారు. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రోజా మాట్లాడటం దారుణమని అన్నారు. ఏడాది పాటు శాసనసభ నుంచి బహిష్కరణకు గురైన రోజున తనపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని అనిత ఆరోపించారు.
 
తాను తన భర్తను వదిలేశానని రోజా వ్యాఖ్యానించడం సరికాదని, తప్పును ఎత్తిచూపడమే తన తప్పా? అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముందు అనుచితంగా ప్రవర్తించడం తగదని చెప్పడం తాను చేసిన తప్పా? అంటూ అడిగారు. రోజా చేసిన వ్యాఖ్యలపై తన పిల్లలకు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తనకు ఏర్పడిందని అనిత వ్యాఖ్యానించారు. మహిళలపై దిగజారి మాట్లాడుతున్న రోజా విషయంలో వైసీపీ అధినేత జగన్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోజా మాట్లాడిన తీరుపై ఎలా స్పందించాలో తెలియక ఇంట్లోనే ఉండిపోయానన్నారు. 
 
అందుచేత రోజాపై తగిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని స్పీకర్ కోడెలను అని కోరారు. దళిత మహిళను అవమానించిన వ్యక్తిని సస్పెండ్ చేస్తే సభనే బహిష్కరిస్తారా? అంటూ ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలా దూషిస్తే ఊరకుంటారా అని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం మహిళా తప్పుబట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేను జగన్ సమర్థించడం సరికాదన్నారు. 
 
మీ కుటుంబ సభ్యులకు ఇలాంటి పరిస్థతి ఏర్పడితే చూసుకుంటూ మిన్నకుండిపోతారా? అంటూ అనిత ప్రశ్నించారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. వ్యక్తిగత అంశాలను సభలో ప్రస్తావించడం సబబుకాదన్నారు. తన పట్ల రోజా అమర్యాదగా ప్రవర్తించారని, రాజా తానొక మహిళ అనే విషయాన్ని మరిచి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని సభాపతికి విజ్ఞప్తి చేశారు.