గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:54 IST)

ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్న చంద్రబాబు : మైసూరా రెడ్డి ధ్వజం

ప్రత్యేకహోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే నీరుగార్చిందని వైసీపీ సీనియర్‌ నేత ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి ఢిల్లీపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కాకుండా.. ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చర్యల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఏపి ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోందని మండిపడ్డారు.
 
ఏపీలోని ప్రజలు కరువు పరిస్థితులు తట్టుకోలేక వలసలు పోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితి రావటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. 
 
'మద్దతు ధర అందక అన్నదాతలు రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 25 శాతమే ధాన్యం సేకరణ జరుగుతోంది. పత్తికి కూడా కనీస మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ హామీ.. ఎన్నికలకే పరిమితమైంది. ఓ పక్క కరువు. మరో పక్క మద్దతు ధర లేదు. ఇన్ని బాధలుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది' అని మైసూరా ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.