బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:51 IST)

నాన్న మంచితనమే నా విజయానికి కారణం : తంగిరాల సౌమ్య

కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో తన విజయానికి తన తండ్రి మంచితనమే ప్రధాన కారణమని ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చెప్పుకొచ్చారు. మంగళవారం వెల్లడైన ఈ ఫలితంలో ఆమెకు 74,827 ఓట్ల మెజారిటీ దక్కగా, కాంగ్రెస్‌కు దక్కిన డిపాజిట్ దక్కించుకుంది. మూడో స్థానంలో నోటా నిలిచింది. ఈ సెగ్మెంట్‌లో మొత్తం 1,84,064 ఓట్లు ఉండగా, 1,27,434 ఓట్లు పోలయ్యాయి.
 
ఇందులో సౌమ్యకు 99,748 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కటారపు పుల్లయ్యకు 941, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న అనంతరం సౌమ్య మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడం కూడా తన గెలుపునకు దోహదపడినట్లు ఆమె తెలిపారు.
  
తన గెలుపునకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలసి ర్యాలీగా స్థానిక రైతుపేటలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సౌమ్య మంత్రి ఉమాకు పాదాభివందనం చేశారు. కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచారు. అక్కడి నుంచి తంగిరాల ప్రభాకరరావు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు టీడీపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు.