శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (15:45 IST)

నంద్యాల ఎన్నికల్లో వైకాపా ఓటమికి జగన్, రోజా నోరే కారణమట?

నంద్యాల ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ ఇచ్చాయి. నంద్యాల ఎన్నికల్లో వైకాపా తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి మలేరియా జ్వరంలో ప్రచారానికి దూరమయ్యారు. ఓటమి చెందుతానని తెలిసి ముం

నంద్యాల ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ ఇచ్చాయి. నంద్యాల ఎన్నికల్లో వైకాపా తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి మలేరియా జ్వరంలో ప్రచారానికి దూరమయ్యారు. ఓటమి చెందుతానని తెలిసి ముందే ఆయనకు జ్వరం పట్టుకుందని వార్తలొచ్చాయి. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమి ముందే ఆ పార్టీ నేతలు ఊహించిందేనని టాక్ వస్తోంది.
 
ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై బహిరంగంగా ఉరేయాలని, కాల్చిపారేయాలని చేసిన వ్యాఖ్యలు బాగా దెబ్బతీశాయని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అంతేగాకుండా వైకాపా ఫైర్ బ్రాండ్ రోజా కూడా భూమా కుటుంబీకులపై చేసిన కామెంట్లు.. అఖిలప్రియ డ్రెస్ కోడ్‌పై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి నెగటివ్ ఫలితాలనిచ్చిందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 
 
అలాగే అఖిల ప్రియ ఫ్యామిలీ సింపథీ కోసం కోసం సీన్ చేస్తుందని, ఓట్ల కోసం చనిపోయిన వారి ఫోటోలతో తిరుగుతుందని శిల్పా మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీ విజయంపై ప్రభావం చూపిందని టాక్. హుందాగా మాట్లాడకుండా నోటికొచ్చినట్లు వైకాపా చీఫ్ జగనే మాట్లాడితే.. ఇక రోజాలాంటి వారు ఎందుకు రెచ్చిపోరని టీడీపీ నేతలు ఇప్పటికే ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల ద్వారా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి అఖిలప్రియపై రోజా వ్యాఖ్యలు బాధ కలిగించాయని భూమా నాగమౌనికారెడ్డి అన్నారు. ఒక మంచి వృత్తి నుంచి వచ్చిన రోజా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. మీ కంటే చిన్నపిల్లలమైన తమపై చేసే విమర్శలు చేసేముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. నంద్యాల ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న మండలాల్లోనూ అనుకూలంగా మెజార్టీ రావడం తమ ధైర్యాన్ని మరింత పెంచిందని భూమా నాగమౌనిక అన్నారు. అద్భుతమైన మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారని తెలిపారు.
 
నాన్నగారి ఆశయాలు నెరవేర్చడానికి ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చారని... దాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామన్నారు. తమపై దాడులు జరిగినా సంయమనం కోల్పోలేదని మౌనిక అన్నారు. నంద్యాల ప్రజలను ఎవరూ మభ్య పెట్టలేరు, మోసం చేయలేరు అనేదానికి ఈ ఫలితాలు ఒక నిదర్శనమన్నారు. 2019 ఎన్నికల్లో గెలుపునకు నంద్యాల తీర్పు బాట వేసిందని భూమా నాగమౌనికా రెడ్డి తెలిపారు.