బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (15:34 IST)

మా బాబు బాధపడ్డారు.. కేసీఆర్ సారీ చెప్పాలి : నన్నపనేని రాజకుమారి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటైన విమర్శలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ తక్షణం సారీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి చంద్రబాబును వెళ్లిపొమ్మనే హక్కు కేసీఆర్‌కు ఏమాత్రం లేదన్నారు. చంద్రబాబు జాతీయస్థాయి నాయకుడు అన్నారు. ఏ ప్రాంతంలో అయినా సభను నిర్వహించికునే హక్కు, పర్యటించే హక్కు ఆయనకు ఉన్నాయన్నారు. 
 
తెరాస ప్లీనరీలో భాగంగా సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ మారుమారు మాటల తూటాలు పేల్చారు. 'మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకో కిరికిరి నాయుడున్నాడు. ఆయన ఇక్కడి నుంచి ఛీ పో అన్నా గానీ పోడట. ఆయనకు రాష్ట్రం ఉంది, రాజధాని ఉంది, చాలా సమస్యలూ ఉన్నాయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. అలా చేయడు. అక్కడ దిక్కులేదు కానీ, చెప్పిన వాగ్దానాలు అమలు చేసే సత్తా లేదు కానీ, పొద్దునలేస్తే లేనిపోని పుల్ల పెడుతుంటాడు ఈడ. ఏపీలో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి సబ్బు పెట్టాడు. రైతులకు అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి సగం మంది రుణాలు కూడా మాఫీ చేయలేదు' అని ఎద్దేవా చేశారు. 
 
అంతేకాకుండా, చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ మోసాలు, చెప్పేవన్నీ అబద్ధాలేనని, అంతా మీడియా మేనేజ్‌మెంటేనని ఆరోపించారు. వాస్తవానికి అక్కడేమీ ప్రజా సంక్షేమం జరగడం లేదని అన్నారు. అలాంటి వ్యక్తి మహబూబ్ నగర్ వచ్చి, 'కేసీఆర్ నిన్ను నిద్రబోనియ్య' అంటాడని, కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజు చేయిస్తానన్నాడట" అని ఎద్దేవా చేశారు. "నీ రాష్ట్రంలో దిక్కులేదు గానీ, ఇక్కడికొచ్చి నిన్ను నిద్రబోనియ్య, నన్ను నిద్రబోనియ్య అనడం కాదు, ఆంధ్రా వెళ్లి ప్రజల వెంటబడి చావు పో" అంటూ ఈసడించుకున్నారు. అయినా, ఇక్కడేమున్నదో తనకు అర్థం కాదని కేసీఆర్ ధ్వజమెత్తారు.