శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (14:23 IST)

టీడీపీలో మళ్లీ పడగ విప్పిన వారసత్వ పోరు: ఎన్టీఆర్-లోకేష్‌ ఏమౌతారు?

టీడీపీలో మళ్లీ వారసత్వ పోరు పడగవిప్పింది. నారావారి కుటుంబానికి.. నందమూరి కుటుంబానికి ఎప్పుడూ మనస్పర్ధలు ఉంటూనే ఉన్నాయి. అలనాటి ఎన్టీఆర్ మరణానికి అనంతరం ఆయన వారసులు బాలయ్య, హరికృష్ణ ఇలా ఎందరున్నా.. నారా చంద్రబాబు నాయుడు మాత్రమే రాజకీయాల్లో రాణించగలిగారు. నందమూరి వంశంలో అందరున్నా ప్రయోజనం లేకపోయింది. 
 
అయితే నందమూరి ఫ్యామిలీలో సత్తా చాటగల హీరో, ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీని నడిపించగలడని టాక్ వచ్చింది. ఇందుకోసం హరికృష్ణ కూడా విశ్వప్రయత్నాలు చేశారు. ఇదే విషయమై చంద్రబాబుకు-హరికృష్ణకు కోల్డ్ వార్ కూడా నడుస్తోంది.  
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ క్రమంగా పార్టీ పైన పట్టు సాధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహానాడు వేదికగా లోకేష్ రంగ ప్రవేశం చేశారు. ఓ వైపు చంద్రబాబు పాలన పైన దృష్టి సారిస్తుంటే.. లోకేష్ పార్టీ పైన పట్టు సాధిస్తున్నారు. 
 
లోకేష్ తెలంగాణ పైన కూడా దృష్టి సారించారు. మాసాయిపేట రైలు ప్రమాద బాధితులను ఆయన స్వయంగా కలుసుకొని చెక్కులు అందించారు. ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం లోకేష్ కసరత్తు కూడా చేస్తున్నారట. లోకేష్ నిత్యం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తున్నారు. 
 
బాబు చాంబర్ ఎదురుగా ఆయనకు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. లోకేష్‌ను కలుసుకునేందుకు చాలామంది వస్తుండటంతో ఇరుకుగా ఉన్న ఈ కార్యాలయాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారట. కార్యకర్తలు, నేతలు నిత్యం తనను కలుసుకునేందుకు లోకేష్ అనుమతిస్తున్నారట.
 
ఎన్నికలకు ముందు టీడీపీలో వారసత్వ పోరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ అలక వహించినట్లుగా వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్‌ల మధ్య వారసత్వ పోరు కనిపించింది. హరికృష్ణ జూనియర్‌ను చంద్రబాబుకు వారసుడిగా తీసుకు వచ్చేందుకు విఫలయత్నం చేశారు. అయితే, దీనిని గమనించిన చంద్రబాబు అప్పటికి వారసత్వ పోరును పక్కన పెట్టేశారు. 
 
ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో.. మహానాడు వేదికగా లోకేష్ ఆరంగేట్రం చేశాడు. తద్వారా భావి వారసుడు జూనియర్ కాదని, లోకేష్ అని తేటతెల్లమైంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారో.. నందమూరి వంశం నుంచి తెలుగుదేశం పార్టీని నడిపే హీరో ఎప్పుడొస్తారో వేచి చూడాలి.