శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (19:42 IST)

నారా లోకేష్ : తుమ్మలకు బుజ్జగింపులు.. కారెక్కవద్దని..

టీఆర్ఎస్‌లో చేరుతారని భావిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బుజ్జగించే పనిలో పడ్డారు. 
 
అస్వస్థతతో తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ఆస్పత్రిలో చేరడంతో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తూ తుమ్మలన్నా... రా కదలి రా, బంగారు తెలంగాణలో ఖమ్మం జిల్లా అభివృద్ధి నీతోనే సాధ్యం - ఇట్లు తుమ్మల అభిమానులు అంటూ సత్తుపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. 
 
ఈ స్థితిలో తుమ్మల అనుచరులు తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. స్థితిలో నారా లోకేష్ రంగంలోకి దిగి తుమ్మల పార్టీ వీడకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. తుమ్మలను బుజ్జగించాల్సిందిగా ఆయన ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తిని కోరినట్లు సమాచారం. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొందరు తనను పని కట్టుకుని ఓడించారని తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టిడిపి రెండుగా చీలిపోయింది. దీంతో చంద్రబాబు వద్ద తన ప్రత్యర్థి మాటనే చెల్లుబాటు అవుతుందనే అసంతృప్తితో తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీంతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన నారాలోకేష్ ఆయన్ని బుజ్జగించే పనుల్లో పడ్డారని తెలుస్తోంది.