గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 ఏప్రియల్ 2017 (05:51 IST)

టీడీపీకి వ్యతిరేకంగా రాసే నెటిజన్లను జైలుకు పంపుదాం: నారా లోకేశ్ ఆదేశం

తెలుగుదేశం పార్టీపై హద్దుమీరు వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్న నెటిజన్లను జైలుకు పంపడానికి టీడీపీ నాయకత్వం సిద్దమవుతోందా? సోషల్ మీడియాలో టీడీపీపై చెలరేగిపోతున్న నెటిజన్లను అదుపు చేసే విషయమై నారా లోకేశ్ చాలా సీరియస్ అవుతున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీపై హద్దుమీరు వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్న నెటిజన్లను జైలుకు పంపడానికి టీడీపీ నాయకత్వం సిద్దమవుతోందా? సోషల్ మీడియాలో టీడీపీపై చెలరేగిపోతున్న నెటిజన్లను అదుపు చేసే విషయమై నారా లోకేశ్ చాలా సీరియస్ అవుతున్నట్లు సమాచారం. ప్రధాన మీడియా మొత్తంగా మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాపై పార్టీకీ ఏమాత్రం నియంత్రణ లేని కారణంగా నెటిజన్లు విచ్చలవిడిగా టీడీపీపై వ్యతిరేక ప్రచారానికి దిగుతున్నారని, ఇది పార్టీ ప్రతిష్టను డ్యామేజ్ చేస్తోంది కాబట్టి ఇకపై నెటిజన్లను అదుపు చేయడానికి పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్నవారిని జైలుకు పంపడానికైనా సరే సిద్ధంగా ఉండాలని తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెదేపా నేతలను కోరినట్లు తెలుస్తోంది. టీడీపీపై బద్ధ వ్యతిరేక ప్రచారం చేస్తున్న నెటిజన్లపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని లోకేశ్ చెప్పినట్లు సమాచారం.
 
ఇటీవల టీడీపీ సమన్వయ భేటీలో ఈ అంశంపై పార్టీనేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నారా లోకేశ్ పార్టీ వ్యతిరేక ప్రచారానికి దిగుతున్న వారిని అదుపు చేయవలసిందే అని స్పష్టం చేసినట్లు వినికిడి.  పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మనం కేసులు పెట్టడం ప్రారంభిస్తే అది ఇతరులకు కూడ గుణపాఠంలా ఉంటుందని లోకేశ్ ఆ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.
 
ముఖ్యంగా తాను ఎంఎల్‌సీగా, మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తనను టార్గెట్ చేస్తూ నెటిజన్లు వ్యవహరిస్తున్న తీరుపై నారాలోకేశ్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. జనంతో మాట్లాడేటప్పుడు లోకేశ్ తడబాటు, తమ భావ వ్యక్తీకరణా నిపుణతలను గేలి చేస్తూ పెడుతున్న వీడియో క్లిప్‌లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. సాక్ష్యాధారాలతో కూడిన ఈ ప్రచారం వల్ల సీఎం కుమారుడి పరువు పోతోందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
 
మూడు రోజులు క్రితం అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ఇంతవరకు బాగుంది. కాని అంబేడ్కర్ జయంతిని కాస్త వర్థంతిగా మార్చి అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అని లోకేశ్ అని మాట్లాడటంతో సోషల్ మీడియా తన తడబాటు గురించి హోరెత్తిపోయింది. ఎంఎల్‌సీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొన్ని తెలుగు పదాలు పలకలేక తారుమారు చేయడం, గత ఎన్నికల ప్రచార సందర్భంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీకు మీరు ఉరేసుకున్నట్లే అని తెలంగాణలో పబ్లిగ్గా మాట్లాడటం, మరో సందర్భంలో దేశంలోనే ఏకైక కులపార్టీ, మతపార్టీ, అవినీతి పార్టీ, డబ్బు యావ ఉన్న పార్టీ తెలుగుదేశం మాత్రమే అంటూ నొక్కి చెప్పడం.. ఇవన్నీ నారా లోకేశ్ పబ్లిగ్గా చేసిన పొరపాట్లే. 
 
వీటిని ఆడియో రూపంలోనూ, వీడియో క్లిప్పుల రూపంలోనూ నెటిజన్లు పోస్ట్ చేయడంతో అది బీభత్సంగా వైరల్‌ అయి పార్టీ పరువును పోగొడుతున్నాయి. అంతే తప్ప నెటిజన్లు కల్పించుకుని రాసిందేదీ వీటిలో లేదు. 
కానీ లోకేశ్ స్వయంగా చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు పదే పదే పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటివారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని లోకేశ్ ఆదేశించారని టీడీపీ అభిజ్ఞ వర్గాల భోగట్టా.
 
అయితే టీడీపీ అదినేత కుమారుడు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వస్తాయన్న అభిప్రాయంతో సమాచార, ప్రజాసంబంధాల మంత్ర కాల్వ శ్రీనివాసులు మరోలా చెప్పేందుకు ప్రయత్నించారు. ఇది లోకేశ్ ఐడియా కాదని, ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లోనే సోషల్ మీడియాపై కొంత అదుపు చర్యలు ఉండాలని ప్రభుత్వం చర్చ జరిపిందని, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలంటూ సైబర్ చట్టాలను పార్టీ అధ్యయనం చేస్తున్నామని మంత్రి చెప్పారు.
 
గతంలో జర్నలిస్టుగా పనిచేసిన కాల్వ శ్రీనివాసులు ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్చ ఉంటుందని కానీ అది ఇతరుల హక్కులకు భంగం కలిగించేదిగా ఉండరాదని, అడ్డూ అదుపూ లేకుండా భాషను వాడుతున్నప్పుడు కొంత అదుపు చేయాల్సిన అవసరం ఉందని కాల్వ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చించాలని అనుకున్నాం కానీ అది సాధ్యపడలేదని కాల్వ చెప్పారు.
 
ఇదంతా బాగుంది. కాని అసెంబ్లీ సమావేశాలంటేనే జుగుప్స కలిగిస్తున్న విధంగా వ్యవహరిస్తున్న అధికార, ప్రతిపక్ష సభ్యుల నోటిని అదుపు చేసే చట్టాలు, చర్యలను ముందుగా అమలు చేసి, తర్వాత సోషల్ మీడియా గురించి ధర్మపన్నాలు చెబితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయ పడుతున్నారు.