శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ívr
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (17:20 IST)

నారా రోహిత్, సీఎం చంద్రబాబుతో ఫోజులు... రూ. 50 లక్షల తాడికొండ టోకరా...

నారా రోహిత్‌తో సినిమా తీస్తున్నా అని చెప్పి, ల‌క్ష‌లు దండుకున్న తాడికొండ సాయికృష్ణ‌ బండారం బయటపడింది. హారోగారితో ఉన్నా... సినిమా షూటింగ్‌లో ఉన్నా అంటూ, అంద‌రినీ మ‌భ్య‌పెట్ట‌డ‌మే కాదు... సినిమా తీస్తున్నాం.. అంటూ ల‌క్ష‌లు దండుకున్న ఓ చోటా నాయ‌కుడి ఉదంత‌మిది. విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత‌లంద‌రితో చ‌నువుగా తిరిగే తాడికొండ సాయికృష్ణ త‌మ‌ను మోసం చేశాడ‌ని, ఆ పార్టీ వారే కేసు పెట్టారు. ప్ర‌ముఖ హీరో నారా రోహిత్ పేరు వినియోగిస్తూ, అంద‌రినీ బురిడీ కొట్టిస్తున్న సాయికృష్ణ‌పై ఫిర్యాదు చేశారు.
 
ఈ ఫోటోలో సినీ హీరో నారా రోహిత్ ప‌క్క‌న ఉన్న వ్య‌క్తి తాడికొండ సాయికృష్ణ‌. టిఎన్‌.ఎస్.ఎఫ్ నేత‌గా చెప్పుకుని తిరిగే, ఇత‌ను అంద‌రివ‌ద్ద భారీగా సొమ్ము వ‌సూళ్ళ‌కు పాల్ప‌డ్డాడు. ముఖ్యంగా హీరో నారా రోహిత్‌తో స‌త్సంబంధాలున్నాయ‌ని ఫోటోలు చూపిస్తూ, ప్ర‌చారం పొందాడు. తాము నారా రోహిత్‌తో సినిమా తీస్తున్నామ‌ని, పెట్టుబ‌డి కావాలంటూ... ప‌లువురి వ‌ద్ద 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్ళ‌కు పాల్ప‌డ్డాడు. 
 
రెండేళ్ళ క్రితం నుంచి అంద‌రివ‌ద్ద వ‌సూళ్ళు చేస్తూ, తీరా సినిమా ఏమీ రాక‌పోయేస‌రికి బాధితులు సాయికృష్ణ‌ను నిల‌దీశారు. దీనితో వారిపై దాడి చేసి, ఎక్క‌డ ఫిర్యాదు చేసినా, పార్టీ కార్యాల‌యం నుంచి ఫోన్ వ‌స్తుంద‌ని బెదిరించాడు. విసిగిపోయిన బాధితులు విజ‌య‌వాడ‌లోని భ‌వానీపురం పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు.
 
తాడికొండ సాయికృష్ణ ఎక్కువ‌గా త‌న ఫేస్‌బుక్ ద్వారా నారా రోహిత్ ఫోటోలు పెట్టి అంద‌రినీ మ‌భ్య‌పెట్టేవాడు. తాను హీరోతో పాటు షూటింగ్‌లో ఉన్నాన‌ని, కావాల్సి వ‌స్తే, రోహిత్‌తో మాట్లాడండి అంటూ షో చేసేవాడు. చివ‌రికి రెండేళ్ళుగా అత‌ను ఆడుతున్న నాట‌కం చూసి నిల‌దీస్తే, సిఆర్డిఎలో పైర‌వీలు చేస్తున్నానని, ఫైల్స్ పూర్త‌యితే ల‌క్ష‌లు వ‌స్తాయ‌ని, అప్పుడు  డ‌బ్బు వాప‌స్ చేస్తానంటాడ‌ని బాధితులు చెప్పారు. తాడికొండ సాయికృష్ణకు ఇపుడు టిఎన్ఎస్ఎఫ్‌తో ఏ సంబంధం లేద‌ని, టీడీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. భ‌వానీపురం పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.