శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (12:02 IST)

నిర్లక్ష్యపు ప్రశ్నపత్రం.. ఎస్వీయూలో గందరగోళం

ఎస్వీయు పరువు గంగలో కలసిపోతోంది. అక్కడ అధికారులకు ఉన్నంత నిర్లక్ష్యం దేశంలో మరే విశ్వవిద్యాలయంలో కనిపించదు. వారికి విద్యార్థులు, వారి భవిష్యత్తు అంటే వారికి ఏ మాత్రం లెక్క కూడా ఉండడం లేదు. నిన్నటి నిన్న పరిశోధక విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని చేత్తో రాసిచ్చి తమ ఘనతను చాటుకున్నారు. ఇక శుక్రవారం అంతకంటే ఘోరమైన తప్పే చేశారు. డిగ్రీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశ్నపత్రం పేరుతో మూడో సంవత్సరం ప్రశ్నపత్రం అందించి విద్యార్థులను గందరగోళం పడేశారు. 
 
ఎస్వీయూ డిగ్రీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో శుక్రవారం ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ పరీక్ష జరిగింది. సంబంధిత ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్నీ తృతీయ సంవత్సరానికి సంబంధించినవే అయినప్పటికీ పైన మాత్రం ద్వితీయ సంవత్సరమని ముద్రించడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ద్వితీయ సంవత్సరం పేరుతో ముద్రించిన తృతీయ సంవత్సరం పర్యావరణం ప్రశ్నపత్రం ముందుగానే ఆయా కేంద్రాలకు చేరిపోయింది. ప్రశ్నపత్రం బండిళ్లు తెరిచిన పరీక్ష కేంద్రం నిర్వాహకులు అందులో ద్వితీయ సంవత్సరమని ముద్రించడంతో తలలు పట్టుకున్నారు. 
 
విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇస్తే ఓ ప్రమాదం. ఇవ్వకపోతే.. మరో ప్రమాదం. ఇలా ఉదయం తొమ్మిదింటికి సజావుగా ప్రారంభం కావాల్సిన పరీక్ష నిర్లక్ష్యం పుణ్యమాంటూ గంటపాటు గందరగోళంగా కొనసాగింది. చివరకు విద్యార్థులే ప్రశ్నల ఆధారం ఈ ప్రశ్నపత్రం తమదేనని చెప్పడంతో ప్రశ్న పత్రాన్ని పంపిణీ చేశారు. ఒకవేళ సంబంధిత ప్రశ్నపత్రం మరో ఏడాదిదై ఉంటే ఏమయ్యేది. ఇది అలసత్వమో..? అసమర్థతో..? ఎస్వీయూ అధికారులే తేల్చుకోవాల్సి ఉంది.