శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: శనివారం, 31 జనవరి 2015 (07:05 IST)

తెలుగు రాష్ట్రాల్లో కొత్త నాటకం... గ్రెటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యం.

రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త రాజకీయ నాటకాలకు తెర తీశాయి. ఎవరి ప్రయోజనాలు వారు చూసుకున్నారు. ఇక్కడ ఇద్దరూ చాలా చల్లగా సడీచప్పుడూ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాల కోసం ఎంసెట్ ను పణంగా పెట్టారు. నిన్నటి వరకూ తెలంగాణాలోని సీమాంధ్రులను శత్రువులుగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ఎన్నికల కోసం వారిని ప్రసన్నం చేసుకోవడానికి కానుకల వర్షం కురిపించారు. 
 
త్వరలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగనున్నాయి. ఒక వైపు తెలంగాణలో కాంగ్రెస్ కుమ్ములాటలలో మునిగి తేలుతోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ చతికిల పడింది. ఇలాంటి తరుణంలో పోటీ ఇటు తెలుగుదేశం, అటు తెలంగాణ రాష్ట్ర సమితుల మధ్యనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలో ఒకటి ఆంధ్రలో ఒకటి తెలంగాణలో అధికారంలో ఉన్నాయి. ఇంతకాలం ఈ రెండు ప్రభుత్వాల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు నడిచాయి. ఒకవైపు ఎంసెట్ కుంపటితో చలి కాచుకున్నారు. అయితే ఈ కుంపటి నుంచి తెలుగుదేశం పార్టీ పలాయనం చిత్తగించింది. 
 
ఎంసెట్ మీద పట్టుబడితే తెలంగాణ రాష్ట్ర సమితికి అది రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ వ్యతిరేకిగా ప్రచారం చేయడానికి వారికి బ్రహ్మాస్త్రం లభించినట్టే. ఇది ముందుగానే గ్రహించిన చంద్రబాబు రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ పై వెనక్కి తగ్గారు. తాము కూడా ప్రత్యేకంగా ఎంసెంట్ నిర్వహించుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. దీని వలన రాజకీయంగా తెలంగాణలో విమర్శల నుంచి తప్పించుకోవచ్చనేది బాబు పన్నాగం. 
 
అయితే ఇక్కడ విద్యార్థులు హైదరాబాద్ చుట్టూ ఉన్న పేరెన్నికగన్న ఇంజనీరిగ్, మెడికల్ కళాశాలలో చదవే అవకాశాలను కోల్పోతారు. తమ పార్టీ రాజకీయ ప్రయోజనానికి వారి భవిష్యత్తును పణంగా పెట్టారు. తెలంగాణ ప్రజలను మచ్చిక చేసుకోవడానికి చట్టప్రకారం తమకు లభించే ఉమ్మడి ఎంసెట్ ను బాబు బలి తీసుకున్నారు. విద్యా వ్యవస్థ మీద దెబ్బ వేశారు. మరోవైపు టీ.ఆర్.ఎస్ ను గమనిస్తే, హైదరబాద్ చుట్టూ పూర్తిగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా స్థిరపడ్డారు. హైదరాబాద్ లో వారి మద్దతు లేకుండా గ్రేటర్ ఎన్నికలకు వెళ్ళడం అంత సులువైన విషయం కాదు. 
 
వారి ప్రభావం అంతగా ఉంటుంది. వారికి కావాల్సింది ఫీజు రీ ఎంబర్సుమెంటు, కళాశాలలో సీట్లు. ఈ  రెండు కీలక అంశాలుగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. తాతల కాలంలో ఇక్కడకు వలస వచ్చినా వారు ఆంధ్రావాలాలుగానే పరిగణిస్తామని రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కేసీఆర్ వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏడేళ్లు ఇక్కడ చదివి ఉంటే చాలు తల్లిదండ్రుల పుట్టుకతో సంబంధం లేదనీ, వారికి ఫీజు రీ ఎంబర్సుమెంటు వర్తిస్తుందని ఓ ప్రకటన చేశారు.
 
ఇది కాకుండా తిరుమల వెంకన్నకు, విజయవాడ కనక దుర్గకు కోట్ల విలువ చేసే ఆభరణాల కానుకలు ప్రకటించి తన విశాల తెలుగుదనాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. దీని ద్వారా తెలంగాణలో ఉన్న రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ జనాన్ని ఆకట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బయట పడాలనేది ఆయన పన్నాగం. మొత్తంపై హైదరాబాద్ ఎన్నికలు లక్ష్యంగా రాజకీయ క్రీడ మొదలయ్యింది.