బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:01 IST)

విశాఖలో భారీ వర్షం : మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురి దుర్మరణం!

విశాఖపట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ వర్షానికి బాగా తడిసిన ఓ ప్రహరీ గోడతో పాటు.. మట్టి పెళ్లలు విరిగిపడటంతో దాని పక్కనే పని చేస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కున్నారు. 
 
గురువారం జరిగిన ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే... విశాఖ సిరిపురం టైకూన్ హోటల్ సమీపంలో ఈ ప్రహరీ గోడ కూలింది. శిథిలాల కింద మరో ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతరాత్రి భారీ వర్షం కురవడంతో గోడతో పాటు.. మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. గురువారం ఉదయం పది గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరి గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పది అడుగుల లోతు ఉన్న... గుంతలో ఆరుగురు కార్మికులు పని చేస్తుండగా... ఒక్కసారిగా ప్రహరీ గోడ, దాని కింద ఉన్న మట్టిపెళ్లలు కుప్పకూలిపోయాయి. వీటి కింద చిక్కుకున్న నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేష్, సోమేష్‌గా గుర్తించారు. వీరంతా ఒడిశా వలస కార్మికులే. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.