శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 28 మే 2015 (08:28 IST)

బీజేపీ పునరంకిత సభలో ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

నల్లగొండ జిల్లాలో బుధవారం జరిగిన బీజేపీ ప్రజాసేవ పునరంకిత సభలో ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశారు. ఒంటినిండా మంటలతో కేకలు వేస్తూ వేదికపైకి దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా సభ మొత్తం హడలెత్తిపోయింది. అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ఏం జరుగుతోందో అర్థంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు, పార్టీ నేతలు కిషన్‌రెడ్డి చుట్టూ వలయంగా మారారు. అక్కడి నుంచి ఆయన్ని బయటకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తి వెంట వచ్చిన ఓ యువకుడిని గుర్తించిన బీజేపీ కార్యకర్తలు అతనిపై దాడికి యత్నించారు. 
 
కిషన్‌రెడ్డి ఎదుటే ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి పేరు బరిశెట్టి శంకర్. ఈయనది నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కేశరాజు పల్లి. ఈ గ్రామ కంఠం భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించడంపై శంకర్ పోరాడుతున్నాడు. కబ్జాకు గురైన భూమిని గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయానికి కేటాయించాలని కొద్ది రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు. జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, తహసీల్దార్‌కు సైతం విన్నవించాడు.
 
కానీ ఆక్రమించుకున్న వ్యక్తి టీఆర్‌ఎస్ కార్యకర్త కావడంతో ఈ వ్యవహారం కొలిక్కి రావడం లేదని ఆవేదన చెందాడు. ఈ విషయమై కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు శంకర్ నల్లగొండ బీజేపీ సభకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. బీజేపీ నేతలు మంటలను ఆర్పి శంకర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తర్వాత కిషన్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి శంకర్‌ను పరామర్శించారు. ఆర్డీవోను పిలిచించి భూ కబ్జా విషయంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శంకర్ కుటుంబానికి న్యాయం చేయాలని, అతన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ బంగ్లా ఎదుట కిషన్‌రెడ్డి ధర్నా చేశారు.