మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: బుధవారం, 23 జులై 2014 (21:03 IST)

విశాఖలో ఆన్ లైన్ మోసం గుట్టు రట్టు

ఆన్ లైన్ మోసానికి పాల్పడిన ముఠా గుట్టు రట్టు చేసారు విశాఖ పోలీసులు. ఆన్ లైన్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి 1,40,000 రూపాయిలు దోచేసారు. ముంబయిలో ఉంటున్న ఈ నిందితుడిని వల పన్ని పోలీసులు పట్టుకోగా మరొకడు పరారిలో ఉన్నాడు. స్థానిక శాంతిపురం ప్రాంతానికి చెందిన పాలెపు లక్ష్మణరావు ఆన్ లైన్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని ఒక లక్ష 40 వేల రూపాయిలు పోగొట్టుకున్నాడు.
 
ఉద్యోగాలున్నాయని నెట్ లో పోస్టు చేసిన "మంజిల్ జికేష్ కుమార్ షా" అనే మోసగాడి వలకు చిక్కుకున్నాడు. ముంబయిలో ఉంటున్న "కుమార్ షా", లక్ష్మణ రావు పోస్టు చేసిన బయోడేటా కు స్పందించి "లింకన్"అనే వ్యక్తితో కలిసి ఆన్ లైన్ లో సంప్రదించాడు. నీవు ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ పోస్టు కోసం అప్లై చేసుకున్నావు కదా.. ఆన్ టెస్టు‌కు సిద్ధమవమని చెప్పి, ఆన్ టెస్టు నిర్వహించి, అందులో సెలెక్ట్ అయ్యావని లక్ష్మణ రావును నమ్మించారు.
 
ఖతార్ లో సీ డ్రిల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నీకు అని చెప్పి.. మెడికల్ టెస్టుల కోసం ముంబయి రావాల్సి ఉంటుందని.. అంతకు ముందు బ్యాంక్ లో ఒక లక్షా 20 వేల రూపాయిలు డిపాజిట్ చేయాలని నమ్మించి కుమార్ షా ఎకౌంట్‌లో వేయించుకున్నాడు. ఆ తరువాత మరో 20 వేలు డిపాజిట్ చేయాలని చెప్పి లింకన్ అనే వ్యక్తి పేరున ముంబయిలో వున్న అతని ఎకౌంట్ లో వేయించుకున్నారు.
 
మొత్తం కలిపి లక్షా 40 వేల రూపాయిలు దోచేసి ఉద్యోగం ఇవ్వక పోవడంతో, మోసపోయానని తెలుసుకున్న లక్ష్మణ రావు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ముంబయిలో "మంజిల్ జికేష్ కుమార్ షా"అదుపులోకి తీసుకున్నారు. లింకన్ అనే మరో నిందితుడు పరారిలో ఉన్నాడు.