శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (16:24 IST)

7 నెలల 23 రోజుల్లో కమిషన్ వస్తుంది.. ప్లీజ్ దీక్ష వద్దు : పి. నారాయణ

కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ మంజునాథ కమిషన్‌ను నెల క్రితమే ఏర్పాటు చేశామని, కమిషన్ కాల పరిమితిని 9 నెలలుగా నిర్ణయించగా, ఇప్పటికే ఒక నెల 7 రోజుల సమయం గడిచిపోయింది. మరో 7 నెలల 23 రోజుల్లో కమిషన్ నివేదిక రానుందని మంత్రి పి నారాయణ గుర్తు చేశారు. అందువల్ల రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం తక్షణం తన దీక్షను విరమించుకోవాలని ఆయన హితవు పలికారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు ఆ మాత్రం సమయం అవసరమేనని, ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించి దయచేసి దీక్ష విరమించాలని ముద్రగడకు నారాయణ విజ్ఞప్తి చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని చెప్పిన నారాయణ, తక్షణమే దీక్ష విరమించాలని ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం సుదీర్ఘ వివరణతో కూడిన విజ్ఞప్తి చేశారు. 
 
'కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్‌కు ఏటా వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని మేం చెప్పాం. మా హామీలకు మేం కట్టుబడి ఉన్నాం. కాపులకు న్యాయం చేయడానికి, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు' అని నారాయణ మరోమారు తేల్చి చెప్పారు.