శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: శనివారం, 10 సెప్టెంబరు 2016 (15:29 IST)

వివాదాల్లో తిరుపతి పద్మావతి వైద్యకళాశాల...?

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలకు మునుపు, అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆది నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలకు మునుపు, అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి  మహిళా వైద్య కళాశాల ఆది నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో ఏర్పాటైన జోనల్‌ వ్యవస్థకు తొలి యేడాది అడ్మిషన్లలోనే తూట్లు పొడిచింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు 85 శాతం సిట్లు కేటాయించాల్సింది ఉండగా జిఓ 120 ద్వారా మొత్తం 13 జిల్లాలనూ లోకల్‌గా పరిగణిస్తూ సీట్ల కేటాయింపు చేశారు. దీంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై రాయలసీమ ప్రాంత విద్యార్థులు, ఉద్యమ నాయకులు గళం విప్పారు.
 
రాజ్యాంగ విరుద్థమైన జిఓ 120 రద్దు కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో సంవత్సరం కూడా అదే జిఓ ద్వారా సీట్లు కేటాయించగా ఆ చీకటి జిఓపై విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ జిఓ చెల్లదని, రాజ్యాంగ విరుద్థమని చెప్పిన కోర్టు 85 సీట్లు రాయలసీమ, నెల్లూరు జిల్లాల వారికే కేటాయించాలని స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అక్కడ కూడా స్విమ్సుకు మొట్టికాయ పడింది. ఆ యేడాది కోర్టుకు వెళ్ళిన 8మంది విద్యార్థులకు అనివార్యంగా సీట్లు కేటాయించింది. ఇకపై జోనల్‌ వ్యవస్థను తప్పక పాటిస్తామని ప్రమాణ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే మూడో యేడాది అడ్మిషన్లు జరిగాయి.
 
అయితే మూడో సంవత్సరం కూడా రిజర్వేషన్లు తిలోదకాలనిస్తూ ప్రవేశాలు కల్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓపెన్‌ కేటగిరిలో 59 సీట్లకుగాను 55 సీట్లు అగ్రకులాలకే కేటాయించారని, ఓపెన్‌ కేటగిరిలో సీటు దక్కే అవకాశమున్న బిసీలను కూడా బిసీ రిజర్వేషన్‌ కోటాలో సీట్లు ఇచ్చారని, దీని వల్ల బీసీలకు రావాల్సిన సీట్లు తగ్గిపోయాయని బిసి సంఘర్షణ సమితి ఆందోళన నిర్వహించింది. బిసీలు ఓపెన్‌ కేటగిరిలో సీట్లు పొందేందుకు అర్హత లేదనే విధంగా అధికారులు వ్యవహరించారని సమితి నాయకులు మండిపడుతున్నారు. మెడికల్‌ అడ్మిషన్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
ఇక స్విమ్సు యూనివర్సిటీ కళాశాలలో అధ్యాపక ఖాళీలు 120 దాకా ఉన్నాయి. వీటిని భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. అయితే స్విమ్సు యాజమాన్యం అధ్యాపక పోస్టులు మొత్తం ఓసీలోనే భర్తీ చేయడానికి సిద్థమైంది. స్విమ్సులో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించిందని తమకు ఎయిమ్స్ తరహా హోదా ఉందని వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎయిమ్స్ లోనూ రిజర్వేషన్లు పాటిస్తున్న విషయాన్ని గుర్తించడం లేదు. దీనిపై షెడ్యూల్‌ కులాల సంక్షేమ సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. స్విమ్సుకు నోటీసులు అందాయి. ఈసారి కోర్టు ఎలాంటి అక్షింతలు వేస్తుందో చూడాలి.
 
యూనివర్సిటీ అధ్యాపకేతర ఉద్యోగాలను తమ ఇష్టారాజ్యంగా భర్తీ చేస్తున్నారు. దీనిపై బిసి సంఘాలు ఉద్యమానికి సన్నద్థమవుతున్నాయి. రాయలసీమ వాసులకు ముఖ్యంగా మహిళా విద్యార్థినులకు ఎంతో ప్రయోజనరాకిగా ఉండాల్సిన మెడికల్‌ కళాశాల మొదటి నుంచి వివాదాస్పదం అవుతున్నా ఎన్‌టిఆర్‌ యూనివర్సిటీగానీ ప్రభుత్వంగానీ  పట్టించుకోవడం లేదు. ప్రతిదానికీ కోర్టులో పరిష్కారం చూపాల్సి వస్తోంది. బడుగు, బలహీనవర్గాల వారు కోర్టు వాజ్యాలకు లక్షల రూపాయలు వెచ్చించే పరిస్థితి ఎక్కడ ఉంటుందో ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పద్మావతి మెడికల్‌ కళాశాల పనితీరును గాడిలో పెట్టాలి.