మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (11:22 IST)

పాస్ పోర్టు కేంద్రాల పరిధిలో మార్పులు.. విజయవాడలో కేంద్రం

భారత విదేశాంగ శాఖ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాస్ పోర్టు కేంద్రాల పరిధిని నిర్ణయిస్తోంది. అలాగే విజయవాడలో అదనంగా కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ కేంద్రంగా శుక్రవారం నుంచి పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాలు, యానాం(పుదుచ్చేరి) ప్రాంతాల్లోని ప్రజలు 22వ తేదీ నుంచి పాస్‌పోర్టు కోసం విజయవాడలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 
 
అయితే పాస్‌పోర్ట్‌ జారీ చేసేది మాత్రం విశాఖపట్నం పాస్‌పోర్ట్‌ కార్యాలయమే. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వారు యథాతథంగా విశాఖపట్నంలో దరఖాస్తు చేసుకోవాలి. మే 22 నుంచి విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయ ప్రధానాధికారే ఈ రెండు పాస్‌పోర్టు కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. 
 
విజయవాడలోని పాస్‌పోర్టు సేవా కేంద్రం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ సేవలందించనుంది. ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు తిరుపతి పాస్‌పోర్టు సేవా కేంద్రం సేవలందిస్తుంది.