శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 30 జులై 2015 (06:55 IST)

పట్టిసీమపై ఎందుకంత యాగీ..? అది పోలవరంలో అంతర్భాగమే.. ఏపీ ఇంకా ఏమంది?

పట్టిసీమపై తెలంగాణ అనవసరంగా యాగీ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అభిప్రాయపడుతోంది. కావాలని... పట్టిసీమను అడ్డుకోవాలనే దురుద్దేశ్యంతోనే బోర్డుకు లేఖ రాసిందని మండిపడింది. పట్టిసీమ వలన తెలంగాణకు ఎటువంటి నష్టం లేకపోయినా అనవసర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, పదేపదే అడ్డుపడుతోందని గోదావరి బోర్డుకు తెలియజేసింది. అది పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమే తప్ప ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదని స్పష్టం చేసింది. 
 
పట్టిసీమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని దీని వలన గోదావరి నీటిని అదనంగా వాడుకుంటున్నారని, ఇది చట్ట విరుద్దమని, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆరాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరి నీటి యాజమాన్య మండలికి లేఖ రాసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ స్పందించింది. 
 
పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వాదన, అభ్యంతరాలు సరికావని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలోగా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగానే పోలవరం ఎర్త్‌డ్యామ్‌ సమీపంలో పట్టిసీమ పథకాన్ని చేపడుతున్నామని వివరించింది. గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించాలన్న నిర్ణయంలో భాగంగానే ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ఏపీ జలవనరుల శాఖ చెబుతోంది. 
 
ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని, కొత్త ప్రాజెక్టు కాదని స్పష్టం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేస్తామని ఏపీ జలవనరుల శాఖ స్పష్టం చేస్తోంది. తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేయడం ఉద్దేశ్యపూర్వకమేనని, ఆ రాష్ట్రానికి దీని వలన వచ్చిన నష్టం ఏమి లేదని తెలిపింది.