శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (13:49 IST)

జగన్‌పై పవన్ సెటైర్లు: వైకాపా పట్టున్న ఊర్లో పవన్‌కు బ్రహ్మరథం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై జనసేనాని, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇటీవలే జగన్ మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తామన్న సంగతి తెలిసిందే. 
 
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై... రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తాను రాలేదని, ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే భూములు ఇస్తానని తాను చెప్పడం లేదని, కేవలం రైతులకు న్యాయం చేయడానికే వచ్చానని... జగన్‌పై సెటైర్ విసిరారు.
 
కేవలం వైకాపాకు చెందిన గ్రామాల వారే భూసేకరణను వ్యతిరేకిస్తున్నారని కొంత మంది మంత్రులు తనతో అన్నారని... అయితే, రైతులు ఏ పార్టీకి చెందినవారన్నది తనకు ముఖ్యం కాదని, వారికి న్యాయం జరగాలన్నదే తనకు ప్రధానమని పవన్ స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత న్యాయం చేస్తానని తాను కబుర్లు చెప్పడం లేదని... ఈ క్షణం నుంచే తాను రైతుల తరపున పోరాటం చేస్తానని అన్నారు.
 
ఇకపోతే.. గుంటూరు జిల్లా బేతపూడి గ్రామం. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఊరి రైతులంతా భూసేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క ఎకరం కూడా ఇవ్వమని ప్రభుత్వానికి ఖరాకండిగా చెప్పేశారు. మరో విషయం ఏమిటంటే, ఈ గ్రామంలో అధిక శాతం వైఎస్సార్సీపీ అభిమానులే. కానీ, వైకాపాకు అత్యంత పట్టున్న ఈ గ్రామ రైతులు గురువారం జనసేన అధినేత పవన్ కు బ్రహ్మరథం పట్టారు.
 
సభా వేదికపై రైతులతో పాటు పవన్ కూడా కిందే కూర్చున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి బాధలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. బలవంతంగా భూసేకరణ చేస్తే రైతుల తరపున పోరాటం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎండ వేడి కారణంగా పవన్‌కు చెమటలు పట్టాయి. దీంతో, పక్కనే ఉన్న ఓ రైతు పవన్‌కు తన టవల్ ఇచ్చారు. ఆ టవల్‌తో పవన్ తన ముఖాన్ని తుడుచుకున్నారు. 
 
మరో మహిళ తాను తెచ్చిన బాక్స్ నుంచి కొంత ఫలహారాన్ని పవన్‌కు తినిపించింది. మరో పెద్ద వయసు మహిళ పవన్‌ను ఆప్యాయంగా ముద్దాడింది. ఈ రకంగా, వైకాపాకు పట్టున్న గ్రామ రైతుల మనసులను పవన్ దోచేసుకున్నారు.