శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జులై 2015 (18:11 IST)

ఇద్దరు చంద్రులను ఏకిపారేసిన పవన్ కళ్యాణ్... సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం లేదా?

రాజకీయాల్లో నీతినిజాయితీలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. రాజకీయాలపై లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా మాట్లాడుతానంటూ ఇరు రాష్ట్రాల సమస్యలను ఏకరవుపెట్టారు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును కోర్టు చూసుకుంటుందని తప్పించుకున్న పపన్... సీమాధ్ర టీడీపీ ఎంపీలకు పౌరుషం లేదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం న్యాయస్థానంలో ఉందని అందువల్ల నా అభిప్రాయాన్ని వెల్లడించేనని చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో జరిగిన ప్రతి విషయం ప్రజలకు తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది. టీడీపీలో గెలిచిన నేతలు ఎందుకు పార్టీ మారారు? ఏ స్వలాభం లేకుండానే మారారా? అని అడిగారు. 
 
'సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు. కనబడడు, ఏమీ మాట్లాడడు' అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‍కు చెందిన పలు పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరు ప్రాంత రాజకీయ నేతలను పవన్ కళ్యాణ్ ఏకిపారేశారు. నేతలు రాజకీయాలను పక్కనబెట్టి.. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపు నిచ్చారు. 
 
రోజూ మీడియా ముందుకు వచ్చి ఎవరినో ఒకరిని తిట్టుకుంటూ గడపాలా? అని పవన్ ప్రశ్నించారు. విమర్శలు చేయడం గొప్పకాదని, వాటిల్లో విలువలు ఉండాలని స్పష్టం చేశారు. ఇదేసమయంలో వర్తమాన రాజకీయాల్లో నీతి నిజాయతీలు సాధ్యమా? అనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. వర్తమాన రాజకీయాల్లో ఒకర్నొకరు తిట్టుకునే విధానం చూస్తే 'పార్టీలన్నీ ఒకటే' అనిపిస్తుందని, పార్టీల నేతల ఆలోచనా విధానంలో మార్పులు రావాలని ఆయన సూచించారు. 
 
మన నేతలు నోరు పారేసుకుని బతుకుతున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. తనకు రాజకీయాలు కొత్త అని సమాజం, దేశం పట్ల ఆందోళన ఉందని పవన్ చెప్పారు. రాష్ట్రం, దేశం ఏమైపోతాయనే ఆందోళన పట్టి పీడిస్తోందని, ప్రజలతో ఇవి మాట్లాడితే ఆందోళనలు రేగుతాయి తప్ప, ఫలితం ఏముంటుందని ప్రశ్నించారు. 
 
రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పార్టీలో లోపాలున్నాయని ఆయన, రాజకీయాల్లో నీతినిజాయితీలతో ఎవరూ లేరని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతోనే సర్దుకుపోవాల్సి వస్తుందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారితే కేసీఆర్‌గారు టీఆర్ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవిచ్చి గౌరవమిచ్చారు. మరి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల మనోభావాల సంగతేంటి? వారి అభిప్రాయాలకు విలువ లేదా? అన్నారు. సనత్ నగర్ ప్రజలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనే ఓట్లేసి గెలిపించారని ఆయన స్పష్టం చేశారు. దానిని నేతలు గుర్తించాలని ఆయన సూచించారు. 
 
పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురకలంటించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని పొగిడిన పవన్ కల్యాణ్... అదేసమయంలో ఆయన అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. టీడీపీని ఆంధ్ర పార్టీగా అనుక్షణం చెబుతున్న కేసీఆర్, ఆంధ్రలో ఎన్నో పార్టీలున్నాయని, అందులో టీడీపీ కూడా ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. 
 
ఆంధ్ర అనేది ఎన్నో మతాల, కులాల సమ్మేళనమని.. టీడీపీ ఆంధ్ర ప్రజలకు చెందింది మాత్రమే కాదన్నారు. సీఎం పదవులు చేపట్టి బోర్ కొడితే వ్యక్తిగతంగా టైమ్ పాస్‌కు తిట్టుకోండే తప్ప.. ప్రజల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని ఏర్పరచకండని సూచించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ -8పై పవన్ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక ఇస్తామని హామీ ఇచ్చి.. రాష్ట్రాన్ని విభజించిన ఎన్డీయే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలా మాట మార్చాయన్నారు. 
 
అలాగే సీమాంధ్ర ఎంపీలు వ్యక్తిగత ప్రయోజనాలు, పదవి, వ్యాపారాల కోసం స్పెషల్ స్టేటస్‌‍పై నోరెత్తకుంటున్నారని దుయ్యబట్టారు. ఉత్తరభారత ఎంపీలతో ఆనాడు పార్లమెంట్‌లో తన్నించుకుని బయటికొచ్చిన సీమాంధ్ర ఎంపీలు పదవులొచ్చాక స్పెషల్ స్టేటస్‌పై నోరు మెదపట్లేదని, వీరికి పౌరుషం అనేది లేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పార్లమెంటులో పోరాడని నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని, తెలంగాణ ఎంపీల స్ఫూర్తిని చూసి నేర్చుకోవాలని క్లాస్ పీకారు. 
 
ఇకపోతే, రాష్ట్రం రెండుగా ముక్కలైపోయిన సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద చాలా బాధ్యతలు ఉన్నాయని గుర్తించాలని పవన్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాత కూడా రాజకీయ ఎత్తుగడలతో గేమ్‌లు ఆడాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై చాలా బాధ్యతలున్నాయి, ఎన్నో సమస్యలు పరిష్కారం కాలేదని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని, సమస్యల పరిష్కారం పక్కనపెట్టి, పార్టీల అవసరాలే లక్ష్యంగా ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారని దుయ్య బట్టారు. 
 
రాష్ట్రాల సరిహద్దుల్లో విద్యార్థులకు బస్సు పాస్ సమస్యలు, నీటి పంపిణీ ఇలా అనేక చిన్నచిన్న సమస్యలు ఉన్న తరుణంలో రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ఒకర్ని ఒకరు తిట్టుకుంటుపోతారా అని ప్రశ్నించారు. ఇకనైనా పొలిటికల్ గేమ్స్‌కు బ్రేక్ వేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ పవన్ సూచించారు.