శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 జనవరి 2017 (17:27 IST)

మాగాణి భూమి డంపింగ్ యార్డ్‌ : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతిలోని కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్షేమదాయం కాదని పవన్ కల్యాణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతిలోని కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్షేమదాయం కాదని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్‌గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలని పవన్ ప్రశ్నించారు.
 
టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ట్రాన్‌స్ట్రాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకపోతే ప్రజాప్రతినిధులను ఏమనుకోవాలని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టిపెట్టడం లేదో అర్థం కావడం లేదని పవన్ అన్నారు. 
 
గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీపరివాహకంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదని చెప్పారు. ఈ భూములను తీసుకుని ఏం చేస్తారో కనీసం వాటిని ఇచ్చిన రైతులకైనా తెలియజేయాలని పవన్ కోరారు. 
 
భూముల సేకరణకు ముందు ఎంతమేరకు నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో అంత మొత్తం ఇవ్వాలని, పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా ఇచ్చి వివక్షత పాటించడం మంచిది కాదని పవన్ హితవు పలికారు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్ చేస్తోందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.