బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: శుక్రవారం, 30 జనవరి 2015 (20:39 IST)

అనంతపురం జిల్లాలో కుంగిన భూమి...! 30 అడుగుల లోతుతో ఏర్పడ్డ గొయ్యి..

కరువుకు నిలయంగా మారుతున్న అనంతపురం జిల్లా భూమిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు, మూడేళ్ల కిందటి వరకూ భూమిలో పొగలు వెలువడితే... ప్రస్తుతం ఏకంగా భూమి కిందకు కుంగిపోయింది. ఇంతా అంతా కాదు. ఏకంగా 30 అడుగుల లోతులోకి భూమి కుంగిపోవడంతో చుట్టుపక్కల సంచరించే జనం భయాందోళనలకు గురవుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
పుట్లూరు మండలం లక్ష్ముంపల్లి గ్రామ సమీపంలోని చిత్రావతి నది సమీపంలో భారీ శబ్దంతో గురువారం రాత్రి పెద్ద గొయ్యి ఏర్పడింది. దాదాపు 25 నుంచి 30 అడుగుల వెడల్పుతో 20 అడుగులకుపైబడి లోతుతో భూమి కుంగిపోయింది. చూసేందుకు భారీ సైజున్న నీళ్లులేని బావిని తలపిస్తోంది. దీనిని చూడడానికి జనం తరలి వస్తున్నారు. 
 
చిత్రావతి నదిలో రెండు దశాబ్దాలు నీరు ప్రవహించడం లేదు. పూర్తిగా ఎండిపోయింది. దీనికి తోడు వర్షాభావం కూడా అనంతపురం జిల్లాలో చాలా తక్కువగా ఉంది. నిత్యం కరువు పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో భూమి కింద భాగంలో గాలి నెర్రెలు ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. ఈ గాలి నెర్రెల కారణంగా భూమి ఒక్క సారిగా కిందకు కుంగిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంపై అనంతపురం జిల్లాలో కొన్నేళ్ళుగా భూమిలో మార్పులు వస్తున్నాయి. 
 
ఎక్కడా గ్యాసు పైపులైన్లు లేకపోయినా కొన్ని ప్రాంతాలలో వేడి కక్కుతూ పొగలు రావడం కూడా సంభవించింది. అయితే ఇలా భూమి కుంగి పోవడం ఇదే మొదటి సారి. అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జియాలజిస్టులు వచ్చి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాల్సి ఉంది.