శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (15:01 IST)

సిరంజి సైకో.. మహిళలు కనిపించారో గుచ్చేస్తాడు... ఎక్కడ?!!

మనం ఇంత వరకూ కత్తిపట్టుకుని తిరిగిన సైకోలను చూశాం. యాసిడ్‌తో దాడిచేసిన వారిని విన్నాం. అలాగే పిస్తోలుతో కాల్పులు జరిపిన సైకోలు తెలుసు. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ సైకో సిరంజి పట్టుకుని తిరుగుతున్నాడు. మహిళలు, అమ్మాయిలు కనిపించారో ఇక అంతే సిరంజి గుచ్చేసి పారిపోతాడు. సిరంజి సైకో పేరు చెబితేనే జిల్లాలోని పలు మండలాలు వణికిపోతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
పాలకోడేరు మండలంలోని కొన్ని గ్రామాలలో ఓ సైకో వీరంగం సృష్టిస్తున్నాడు. కనిపించిన మహిళలకల్లా సిరంజితో సూది మందు వేసేస్తున్నాడు. రెండు రోజుల కింద ఓ ఇంటర్ విద్యార్థిని కాలేజీకి వెళుతుంటే దారిలో మాటలు కలిపి అకస్మాత్తుగా సిరంజితో సూది మందు ఎక్కించాడు. ఆమె అలాగే కళాశాలకు వెళ్లి విషయం లెక్చరర్లకు తెలుపడంతో వారు ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అంతకుముందు కూడా ఓ విద్యార్థినికి ఇలాగే చేశాడు. 
 
సోమవారం ఉదయం తిరిగి పక్క గ్రామంలో ఓ మహిళ ముగ్గు వేసుకుంటుండగా మోటారు సైకిల్‌పై వచ్చి సిరంజితో గుచ్చేసి వెళ్ళిపోయాడు. మహిళ వెంటనే సిరంజి నీడిల్ తీసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమి లేదంటూనే సిరంజిని పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ వరుస సంఘటనలతో ఆ ప్రాంత మహిళలు భయకంపితులవుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.