శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (11:45 IST)

అరకు ఎమ్మెల్యే కిడారిని నమ్మకస్థులే పట్టించారా?

విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చి సరిగ్గా వారం రోజులైంది. వారిపై తూటా పేల్చినవారి నుంచి వ్యూహరచన చేసిన వారి దాకా.. అందరిపై పోలీస

విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చి సరిగ్గా వారం రోజులైంది. వారిపై తూటా పేల్చినవారి నుంచి వ్యూహరచన చేసిన వారి దాకా.. అందరిపై పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. మావోయిస్టు సానుభూతిపరులు, ఈ దాడికి ప్రత్యేకంగా సహకరించిన వ్యక్తులు, శక్తుల గురించీ ఆరా తీశారు. ఈ క్రమంలో శనివారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్దరు కిడారికి బాగా సన్నిహితులని సమాచారం.
 
ఎమ్మెల్యే కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేసి.. ఆయనను ఉచ్చులోకి దింపింది వీరేనని చెబుతున్నారు. వారి కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. కాగా, లివిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను చంపేసిన తర్వాత.. ఆ పరిసరాల్లోనే రెండు రోజులు నక్సల్స్‌ ఉన్నారన్న సమాచారం పోలీసులకు ఉంది. ఆ తర్వాత కూడా వారు తమ స్థావరాలకు చేరుకోలేదని తాజాగా తెలిసింది. 
 
ఇప్పటికీ మన్యం పరిధిలోని ఒడిసా సరిహద్దు గ్రామాల్లోనే తలదాచుకొంటున్నారని తెలుస్తోంది. ఆ గ్రామాలను ఇప్పటికే గుర్తించిన మన పోలీసులు.. ఒడిసా పోలీసులతో కలిసి దాడులకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా, గట్టి బదులివ్వాల్సిందేనన్న కసి వారిలో కనిపిస్తోంది.
 
అలాగే, అరకు జంట హత్యల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాష్ట్ర సరిహద్దుల్లోని విలీన మండలాల్లో పోలీసుల గాలింపు ముమ్మరమైంది. ఈ మండలాల పరిధిలో సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఓ గ్రామం పోలీసు బూట్లచప్పుళ్ల మధ్య బిక్కుబిక్కుమంటోంది. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఎప్పుడు ఏమి జరుగుతోందన్న భయం గ్రామస్థుల్లో కనిపిస్తోంది.