గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (04:14 IST)

పన్నీర్ సెల్వంకి స్టాలిన్ మద్దతు వెనుక భయంకరమైన వ్యూహం?

రెండు నెలల క్రితం వరకు అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్థి డిఎంకే పక్ష నేతలతో, ఎమ్మెల్యేలతో మాట్లాడ్డానికి కూడా భయపడేవారు. వ్య్కతిగత కార్యక్రమాల్లో, ప్రత్యేక ఫంక్షన్లలో ప్రతిపక్ష నేతలు కలిసే సందర్భంలో కూడా వారివైపు కన్నెత్తి చూడటానికి కూడా అన్నాడీ

రెండు నెలల క్రితం వరకు అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్థి డిఎంకే పక్ష నేతలతో, ఎమ్మెల్యేలతో మాట్లాడ్డానికి కూడా భయపడేవారు. వ్య్కతిగత కార్యక్రమాల్లో,  ప్రత్యేక ఫంక్షన్లలో ప్రతిపక్ష నేతలు కలిసే సందర్భంలో కూడా వారివైపు కన్నెత్తి చూడటానికి కూడా అన్నాడీఎంకే నేతలు, మంత్రులు సైతం సాహసించలేకపోయేవారు. కారణం జయలలిత. డీఎంకేని ఒక ప్రత్యర్థిగా కాకుండా, ఒక శత్రువులాగా ద్వేషించిన ఆమె తనపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తల్లో కూడా అదే ద్వేషభావాన్ని రంగరించిపోశారు. పొరపాటున ఎవరైనా డీఎంకే నాయకులతో మాట్లాడారని తెలిస్తే చాలు వారికి ఉద్వాసనే ఖాయం. అలాంటిది జయలలిత మరణానంతరం రెండునెలల్లోపు పరిస్థితి ఎంత మారిపోయింది? ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్‌తో నవ్వుతూ మాట్లాడటం ఒక షాక్ అయితే...అన్నా డీఎంకే అధికారపోరులో ఏకంగా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించేవరకు డీఎంకే వెళ్లడం.. ఆశ్చర్యం కలిగిస్తుంది. కాని ఇదంతా రాజకీయ పార్టీలకే అనుభవమైన రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతోందా అంటే నిజమేనని చెప్పాలి.
 
తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన జయలలిత నమ్మినబంటు, ఒ.పన్నీర్‌సెల్వం అంటే డీఎంకేకు ఎందుకంత అభిమానం? ఆయన్ని ఆదుకునేందుకు, ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు డీఎంకే ఎందుకంత తహతహలాడుతోంది? ఓపీఎస్‌ అడగకముందే ఆయనకు అండదండలందించేందుకు ఎందుకు ఉత్సాహపడుతోంది.. ఇవీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రేగుతున్న సందేహాలు. వీటన్నింటినీ పరికించి చూస్తే తమ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే డీఎంకే నేతలు ఓపీఎస్‌కు మద్దతిస్తున్నారన్నది సుస్పష్టమైపోతోంది. 
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తగినంతమంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటు చేస్తే అది మునుముందు తమకు చేటు తెస్తుందని డీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. ఎంతలేదన్నా జయ నీడగా వున్నందున ఆమెకూ పార్టీ నిర్వహణపైనా, ప్రభుత్వ పాలనపైనా కొంత అవగాహన వుంది. దీంతో ఆమె ముఖ్యమంత్రి అయిన తరువాత నియంతగా గానీ, లేదా పక్కా రాజనీతితోగానీ ఆమె పార్టీని నిలబెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఆమె అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకు రాలేకపోయినా, డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థిగా వుండడం మాత్రం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 
 
దీంతో మునుముందు తమ పార్టీకి గట్టి ప్రత్యర్థి లేకుండా చూసుకోవడం మంచిదన్న ఉద్దేశంతో డీఎంకే నేతలు వున్నారు. అందుకే వారు ఓపీఎస్‌కు మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ఓపీఎస్‌కు తగినంతమంది ఎమ్మెల్యేలు లేరన్నది ఇప్పటికే స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేల బలం కేవలం ఏడుగానే కనిపిస్తోంది. దేవర్‌ వర్గానికి చెందిన మరో 30 మంది వరకూ ఆయనకు మద్దతిచ్చే అవకాశముందని సమాచారం. మునుముందు జరిగే పరిణామాల్లో అన్నాడీఎంకే నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆ బలం సరిపోదు. 
 
దీనినే 89 మంది ఎమ్మెల్యేలున్న డీఎంకే ఒక అవకాశంగా తీసుకుంది. ఇప్పటికి ఓపీఎస్‌కు మద్దతిస్తే ఆయన ప్రభుత్వ ఏర్పాటు చేస్తారు.
దాంతో శశికళకు అడ్డుకట్ట వేసినట్టే అవుతుందన్నది డీఎంకే నేతల భావనగా వుంది. అధికారం లేని, అంతగా ఆదరణలేని శశికళ వెంట ఎమ్మెల్యేలు, నేతలు ఉండబోరు. దీంతో ఆమె నిస్సహాయురాలిగా మారిపోతారు. కొంతకాలం తరువాత ఓపీఎస్‌కు మద్దతు ఉపసంహరించుకుంటే ఆ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ పార్టీయే అధికారం చేపడుతుందని డీఎంకే నేతలు భావిస్తున్నారు. 
 
ఒకవేళ కొంతకాలం తరువాత తాము అండగా నిలిచినందుకు ప్రతిగా పన్నీర్‌సెల్వమే తమకే మద్దతిస్తే.. తామే ప్రభుత్వం ఏర్పాటు చేయడం, లేదా కకావికలైన అన్నాడీఎంకే నుంచి వచ్చే ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటు చేయవచ్చన్నది డీఎంకే నేతల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇవన్నీ జరగాలంటే ముందుగా శశికళకు చెక్‌ పెట్టడమే తగిన వ్యూహమని, దీనికోసం ఎంతకైనా సిద్ధమవ్వాలని డీఎంకే భావిస్తోంది.