శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (09:20 IST)

ఢిల్లీకి చేరిన విద్యుత్‌ ఉద్యోగుల వివాదం.. నేడు భేటీ

తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల వివాదం ఢిల్లీకి చేరింది. కేంద్ర హోంశాఖ ఎదుట ఈ పంచాయితీ జరుగనున్నది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తమ వాదనలు వినిపించడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు ఢిల్లీ చేరుకున్నారు.
 
ఆంధ్రా స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రిలీవ్‌ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఆ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దానిపైనే కేంద్ర హోంశాఖ స్పందిస్తూ 2014 జూన్‌ ఒకటో తేదీనాటికి ఉన్న యథాతథస్థితిని కొనసాగించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఇటీవల లేఖ రాసింది. 
 
ఈ విషయమై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలూ తెలియజేయాలని అందులోనే కోరింది. దీనిపైనే కేంద్ర హోంశాఖ అడగబోయే అన్ని ప్రశ్నలకు సమాధానాలను సమాయత్తం చేసుకుని అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు.