మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (10:40 IST)

బస్సు బాక్సుల్లో పేలుడు పదార్థాలు.. అందుకే మంటలు.. లొంగిపోయిన డ్రైవర్

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు వద్ద అగ్నికి ఆహుతి అయిన బస్సు దుర్ఘటనపై ఉలవపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బస్సులోని లగేజీ క్యారియర్‌లో కొన్ని బాక్సులపై ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోనే బస్సు డిక్కీలోకి చేరిన సదరు బాక్సుల్లో స్వీట్లు ఉన్నాయని డ్రైవర్ చెప్పాడని ప్రయాణికులు చెబుతున్నారు. 
 
అయితే వాటిలో పేలుడు పదార్థాలున్నట్లు అనుమానాలున్నాయని వారు పోలీసులకు చెప్పారు. ఇదిలావుంటే, ప్రమాదం జరిగిన వెంటనే బస్సును నిలిపేసి ప్రయాణికులను అప్రమత్తం చేసిన డ్రైవర్, క్లీనర్‌తో పాటు పరారయ్యాడు. అంతేకాక డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న పర్వీన్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం. 
 
ఇదిలావుండగా, ప్రకాశం జిల్లా చాగల్లు దుర్ఘటనకు సంబంధించి వోల్వో బస్సు డ్రైవర్ కొద్దిసేపటి క్రితం ఉలవపాడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. బస్సు నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి తక్షణమే బస్సును నిలిపేశాడు. అనంతరం ప్రయాణికులను అప్రమత్తం చేసి భారీ ప్రాణ నష్టాన్ని నివారించాడు. బస్సు మంటల్లో దహనమైపోతుండటాన్ని కళ్లారా చూసి భయభ్రాంతులకు గురైన అతడు బస్సు క్లీనర్‌తో కలసి పరారయ్యాడు. 
 
ఆ తర్వాత ఉలవపాడు పీఎస్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదిలావుంటే, రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగితే, మూడు గంటల తర్వాత కాని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. ఆలస్యంగా చేరుకోవడమే కాక, తమను అవమానపరచే విధంగా పోలీసులు వ్యాఖ్యానించారని బాధితులు వాపోతున్నారు.