మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (09:01 IST)

చంద్రబాబు జేజమ్మ దిగివచ్చినా సమ్మతించం.. ఉద్యమానికి సిద్ధం కండి : ఆర్ కృష్ణయ్య పిలుపు

కాపులను బీసీల్లో చేర్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఆరంభంలోనే అడ్డుకునేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నడుంబిగించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా కాపులను బీసీల్లో చేర్చనివ్వబోమని ప్రకటించారు. అవసరమైతే తమ జాతి ప్రజలతో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ఆయన ప్రకటించారు. 
 
కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, వారిని బీసీ జాబితాలో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. చిన్నచిన్న కులాలను బీసీ జాబితాలో చేరిస్తే స్వాగతిస్తామని, కానీ... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను చంద్రబాబు కాదు కదా.. ప్రధాని దిగివచ్చినా బీసీ జాబితాలో చేర్చనివ్వబోమన్నారు. 
 
బీసీ జాతికి అన్యాయం జరిగితే ఊరుకోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవి తనకు గడ్డిపోచతో సమానమని, అవసరమైతే దాన్ని కూడా వదులుకొని బీసీలకు న్యాయం చేసేందుకు పోరాటం చేస్తానని కృష్ణయ్య ప్రకటించారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, బీసీ జాతికి ఎక్కడ కూడా అన్యాయం జరుగకుండా చూసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు ఈ టీ టీడీపీకి చెందిన ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే ప్రకటించారు.