శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (08:52 IST)

పాటతో కరిగించిన కీరవాణి.. కన్నీరు మున్నీరైన రాజమౌళి.. ఓదార్చిన కుమార్తె

రాజమౌళి తన జీవితంలో తొలిసారిగా బహిరంగంగా కన్నీరు పెట్టిన అరుదైన ఘటనకు బాహుబలి 2 ప్రీ-రిలీజ్ వేడుక సాక్షీభూతమై నిలిచింది. అయిదేళ్ల కష్టాన్ని, బాహుబలి సినిమా పెట్టిన టెన్షన్‌ని మర్చిపోయి రాజమౌళి కన్నీరెట్టిన దృశ్యం ఆహుతులను మాత్రమే కాకుండా కుటుంబ సభ్యు

రాజమౌళి తన జీవితంలో తొలిసారిగా బహిరంగంగా కన్నీరు పెట్టిన అరుదైన ఘటనకు బాహుబలి 2 ప్రీ-రిలీజ్ వేడుక సాక్షీభూతమై నిలిచింది. అయిదేళ్ల కష్టాన్ని, బాహుబలి సినిమా పెట్టిన టెన్షన్‌ని మర్చిపోయి రాజమౌళి కన్నీరెట్టిన దృశ్యం ఆహుతులను మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ద్రవింపజేసింది. కన్నకూతురు ఏడుస్తున్న తండ్రిని చూసి గాఢంగా కౌగలించుకుని అనునయించింది. బాహుబలిని మించిన ఎమోషన్స్‌తో భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకెళ్లిన ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ కదిలించింది. రాజమౌళి కంట కన్నీరు పెట్టించిన ఘటనకు కీరవాణి పాట కారణమైంది.
 
విషయానికి వస్తే. రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి 2 ప్రీ రిలీజ్ వేడుకల ముగింపు సందర్భంగా కీరవాణి ఒక అద్భుతాన్నే సృష్టంచారు. వేదికపైన చిత్రబృందం ఒక్కొక్కరి ఆడియో విజువల్‌ ప్రదర్శించిన సమయంలో వారి కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన పాటను వినిపించారు. రాజమౌళి కోసం ప్రత్యేకంగా రాసిన పాటను కీరవాణి పాడగా.. వేదికపైనే ఉన్న రాజమౌళి కంట తడిపెట్టారు. ఆ పాట ఏంటంటే... 
 
ఎవ్వడంటా... ఎవ్వడంటా... బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది.. ఎవ్వరూ కనంది. ఎక్కడా వినంది. శివుని ఆన అయ్యిందేమో.... హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. పెంచింది రాజ నందిని.. కొండంత ప్రేమతో... ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా చిరుయువై యశస్సుతో.. ఇలాగే సాగిపొమ్మని పెద్దన్న నోటి దీవెన.. శివుణ్ణి కోరు ప్రార్థన.. అంటూ పాట పాడుతున్నంత సేపు రాజమౌళి తెర వైపు ముఖం పెట్టి కన్నీళ్లు కారుస్తూ నిలబడిపోయాడు. పాట పాడుతూ చూస్తున్న కీరవాణి మెల్లగా రాజమౌళి భుజం తట్టి హత్తుకున్నాడు. 
 
పాట పూర్తి కాగానే వేదన భరించలేక రాజమౌళి దాదాపు పరుగెత్తుకెళ్లేటట్టు వేదికి దిగిపోయాడు. వేదిక కింద ఆసీసులైన ప్రతి ఒక్కరికీ తన బాధ తెలుస్తూనే ఉంది. తల్లి రమ సైగ చేసిందో ఏమో కాని రాజమౌళి కుమార్తె ఒక్కసారిగా తండ్రిని కౌగలించుకుని అనునుయించింది. చూస్తున్న రాఘవేంద్రరావు దగ్గరికి వచ్చి భుజంపై తడుతూ ఓదార్చాడు. అందరూ ఆ దృశ్యాన్ని దిగ్భ్రాంతితో చూస్తుండిపోయారు.
 
బాహుబలి ది బిగినింగ్ లో కోట్లమందిని రంజింప చేసిన, మంత్రముగ్ధులను చేసిన పాట  ఎవ్వడంట. ఎవ్వడంటా. శివలింగాన్ని ఎత్తుకున్న బాహుబలి భారీతనం గురించి వర్ణిస్తూ అన్ని భాషల ప్రేక్షకులను మైమరిపించిన, తాదాత్మ్యతకు గురిచేసిన పాట అది. ఆ పాటను తనకు వర్తింపజేసి తన పెద్దన్న కీరవాణి అదే టోన్‌తో పాడుతుండడం రాజమౌళిని కరిగించేసింది. దర్శకత్వాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లిన ఆ మొండి గుండె కరిగి నీరైంది.