శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (19:34 IST)

రేషన్ రద్దు కాదు, గ్యాస్ ప్రమాదంలో మరణిస్తే రూ.6 లక్షల పరిహారం... ప్రత్తిపాటి

అమరావతి : వినియోగదారులు బలోపేతం కావాలని రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ చైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు ఇచ్చారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ

అమరావతి : వినియోగదారులు బలోపేతం కావాలని రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ చైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు ఇచ్చారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. వస్తువుల నాణ్యత, ధరలు, తూనికలు, కొలతల విషయంలో వినియోగదారులు తగినంత జాగ్రత్తగా ఉండాలన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను, జనరిక్ మందుల అధిక ధరలను నియంత్రిస్తామని చెప్పారు. 
 
మార్కెట్లో చింతపండు ధర బాగా పెరిగిందన్నారు. రేషన్ బియ్యం మిల్లులకు తరలకుండా, రేషన్ డిపోలవారు మోసాలకు పాల్పడకుండా రేషన్ షాపు డీలర్ల అసోసియేషన్ వారు నియంత్రించాలని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బియ్యం అక్రమ రవాణా జరుగకుండా, పంటలో మార్పు తీసుకువచ్చి ప్రజలు తినే బియ్యంనే పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు తినే ధాన్యాన్ని పండిస్తున్నారని, అందువల్ల ఆ రెండు జిల్లాల్లో పంపిణీ చేసిన బియ్యం అక్రమ రవాణా కావడంలేదని తెలిపారు. 
 
ఇతర ప్రాంతాల్లో కూడా రైతులతో మాట్లాడి ఆ విధానం అనుసరిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో 48 గంటల్లో రైతుల ఖాతాలకు నగదు జమ అవుతున్నట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు గానీ, బదిలీలు గానీ, పేరులు, అడ్రస్, ఇతర వివరాల మార్పులకు చేసుకున్న దరకాస్తులు 38 వేలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని 15 రోజుల్లో అందజేస్తామని చెప్పారు. చంద్రన్న విలేజ్ మాల్స్‌లో మూడు రకాల సరుకులు, మూడు రకాల ధరలు కాకుండా సాదారణ నాణ్యత కలిగిన ఒకే రకమైన సరుకులు అమ్మితే బాగుంటుందన్న అభిప్రాయం మంత్రి వ్యక్తం చేశారు. ఈసారి సమావేశానికి రిలయన్స్, కెపీఎంజీ వారిని కూడా పిలవమని మంత్రి అధికారులను ఆదేశించారు. 
 
రేషన్ డిపోలలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఫొటో గుర్తింపు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు అమలు చేస్తున్నామని, తరువాత రేషన్ డిపోలలో అమలు చేస్తామని చెప్పారు. గ్యాస్ సిలెండర్ ప్రమాదాల వల్ల అనంతపురంలో ఒకరు మృతి చెందారని, చిలకలూరిపేటలో ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేయమని మంత్రి అధికారులను ఆదేశించారు. బంగారం అమ్మకాలలో హాల్ మార్క్ పేరుతో జరిగే మోసాలను సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఓ పెద్ద వ్యాపార సంస్థ అమ్మిన రెండు కిలోల బంగారంలో 650 గ్రాముల మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తెలిపారు. హాల్ మార్క్ ఉన్నా అందులో స్వచ్చమైన బంగారం ఎంత ఉందో వినియోగదారులు తెలుసుకోవాలని అవసరం ఉందని సభ్యులు చెప్పారు. అందుకు సమాదానంగా రాష్ట్రంలో బంగారం నాణ్యత కనుగొనే 5 ల్యాబ్ లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలను కూడా త్వరలో నియమిస్తామని మంత్రి ప్రత్తిపాటి చెప్పారు.
 
గ్యాస్ డెలివరీ చేసేవారికి బిల్లు ప్రకారమే డబ్బు చెల్లించాలని, అదనంగా చెల్లించవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ బుదితి రాజశేఖర్ చెప్పారు. ఈ విషయంలో వినియోగదారులే వారిని నియంత్రించాలన్నారు. గ్యాస్ సిలెండర్ ప్రమాదం వల్ల ఎవరైనా మరణిస్తే, మరణించిన ఒక్కొక్కరికి రూ.6 లక్షలు, ఒక్క సంఘటనకు గరిష్టస్థాయిలో రూ.30 లక్షల వరకు వైద్య ఖర్చులు, ఆస్తి నష్టానికి రూ.2 లక్షల వరకు నష్టపరిహారంగా చెల్లిస్తారని ఆయన వివరించారు. రేషన్ బియ్యంగానీ, ఇతర సరుకులు గానీ ఎన్ని నెలలు తీసుకోకపోయినా కార్డును మాత్రం రద్దు చేయరని, రద్దు చేస్తారన్న అపోహ వద్దని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, వాటిలో కోటి 9 లక్షల కార్డులు వాడుకలో ఉన్నట్లు తెలిపారు. 
 
ఒక ప్రాంతంలో మరో ప్రాంతంలో సరుకులు తీసుకునే వెసులుబాటు ద్వారా 20 లక్షల కార్డుదారులు ప్రయోజనం పొందినట్లు చెప్పారు. ఈపోస్ సర్వర్ సమస్యలు పరిష్కారమైనట్లు తెలిపారు. పక్కా ఇళ్లకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందువల్ల కిరోసిన్ రద్దు చేసినట్లు చెప్పారు. రేషన్ డిపో డీలర్లను చాలా వరకు నియమించామని, మరి కొన్ని డీలర్ షిప్ ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. అతి కొద్ది డిపోలు లీగల్ సమస్యల వల్ల భర్తీ చేయలేదన్నారు. చంద్రన్న విలేజ్ మాల్స్ మొదటి దశలో జూలై నాటికి ప్రతి జిల్లాలో 500 ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినియోగదారుల సంతృప్తిని తెలుసుకోవడానికి ఉపాధి హామీ పనుల పథకంలో చేస్తున్న మాదిరిగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేషన్ డిపోలలో జరిగే అవకతవకలను అరికట్టడానికి అసోసేషన్ వారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అటువంటి డిపోలను రద్దు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులు ఏ సమస్యనైనా టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు కాల్ చేయవచ్చిని తెలిపారు.