శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (17:09 IST)

గుంటూరులో ఎలుకలు.. నెల్లూరులో పిచ్చికుక్కలు.. ప.గోలో ఇంజెక్షన్ సైకో... ఇదీ ఏపీ పరిస్థితి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హైటెక్ పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన గుంటూరులోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలోనే మూషిక రాజులు విగటాట్టహాసం. నెల్లూరు జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజెక్షన్ అగంతకుడు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. దీంతో ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచక భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
వాస్తవానికి సీమాంధ్రలోని 13 జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతున్న విషయంతెల్సిందే. ప్రాథమిక, ఏరియా ఆస్పత్రుల్లోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రధాన ఆస్పత్రుల్లోనే ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా అనేక శిశుమరణాలు వివిధ రూపాల్లో సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో జన్మించిన ఓ పసికందుపై మూషికాలు దాడి చేయడంతో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షకలకు ఎక్కింది. పైగా ఈ ఘటన ప్రభుత్వ ఆస్పత్రిలోని దారుణమై స్థితిగతులను కళ్లకు కట్టింది. 
 
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మొద్దునిద్రను వీడిన వైద్యాధికారులు ఆస్పత్రులను, వాటి పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అలాగే ఆస్పత్రుల్లో ఎలుకలు, పందికొక్కులను పట్టుకునేందుకు వేటగాళ్లను రంగంలోకి దించారు. వీరు ఒక్క గుంటూరు ఆస్పత్రిలోనే 50 నుంచి 100 మూషికాలను పట్టుకున్నారు. ఒకవైపు.. ఎలుకల కోసం వేట సాగిస్తూనే మరోవైపు.. ఆసుపత్రి మొత్తాన్ని శుభ్రం చేయించే పనిని వైద్యాధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 
 
ఇక నెల్లూరు జిల్లా కేంద్రానికి వస్తే.. ఇక్కడ పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓ పిచ్చికుక్క శుక్రవారం ఒక్కరోజే పది మందిని కాటేసింది.  వాస్తవానికి జిల్లా కేంద్రంలో పిచ్చికుక్కలు, వీధి కుక్కలు బాధ ఉందని స్థానికులు గగ్గోలు పెట్టినా.. జిల్లా మున్సిపల్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో కూడా పిచ్చికుక్కలు అనేక మందిని కరిచాయి కూడా అయినప్పటికీ అధికారులు మాత్రం లైట్‌గా తీసుకున్నారు. ఇపుడు తాజాగా ఒకే రోజు పది మందిని కరవడంతో అధికారులు మేల్కొన్నారు. 
 
అలాగే, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజెక్షన్ అగంతకుడు రెచ్చిపోడుతున్నాడు. ఈ సైకోను పట్టుకునేందుకు 200 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా, ఈ బృందాలకు సవాల్ విసిరేలా.. శుక్రవారం నర్సాపురంలో తొమ్మిదేళ్ళ బాలికకు ఇంజెక్షన్ గుచ్చి పారిపోయాడు. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విధంగా ఇంజెక్షన్ సైకో బారిన పడిన వారి సంఖ్య 12కు చేరింది. ఈ సైకోకు సంబంధించిన ఊహా చిత్రాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు.