శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (11:11 IST)

రాజీవ్ గాంధీ కారు డ్రైవ్ చేస్తుంటే నేను పక్క సీట్లో కూర్చొనేవాడిని : రాయపాటి

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడినట్టుగా తాను కష్టపడలేకపోతున్నానని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రోజుకు 18 గంటలపాటు కష్టపడతారని, తాను 10 గంటలు కూడా కష్టపడలేకపోతున్నానని వాపోయారు. వయసు రీత్యా తాను ఎక్కువగా పనిచేయలేకపోతున్నానని చెప్పారు. 1982లో తానెవరో పూర్తిగా తెలియకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు తాను నామినేషన్ వేసే అవకాశాన్ని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కల్పించారన్నారు. ఆనాటి నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో సాన్నిహిత్యం ఉందని, వాళ్ల ఇంట్లో సభ్యుడిగానే మెలిగానని రాయపాటి చెప్పారు. అయితే, కొన్ని కారణాల వల్లే తన నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లో కొనసాగాల్సి వచ్చిందని, ఏదైనా విషయంపై ఆ సందర్భంలో తనకు తోచింది తాను మాట్లాడతానని, అది తన మనస్తత్వమన్నారు. 
 
నా నుంచి కాంగ్రెస్ బ్లడ్ పారిపోయింది... దాని స్థానంలో టీడీపీ బ్లడ్ వచ్చిందన్నారు. 30 సంవత్సరాలకు పైబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీలో కాంగ్రెస్ బ్లడ్ ఇంకా ఉందా? అనే ప్రశ్నకు రాయపాటి పైవిధంగా స్పందించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఉన్నట్లయితే ‘కాంగ్రెస్ రక్తమే’ తనలో ఉండేదని.. ఇప్పుడు వాళ్లు లేరు కనుక టీడీపీ రక్తం తనలోకి కొత్తగా వచ్చిందని సమాధానమిచ్చారు. 
 
‘గాంధీ కుటుంబానికి చాలా దగ్గరగా మసలిన మిమ్మల్ని ఆ కుటుంబం ద్రోహం చేసిన మాట వాస్తవమేనా?’ అని ప్రశ్నించగా.. ‘ఆ కుటుంబం నాకు ద్రోహం చేసిన మాట వాస్తవమే. ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లేవాడిని. రాజీవ్ గాంధీ బెంజ్ కారు తోలుతుంటే నేను పక్కన కూర్చునే వాడిని. ఆయనకు నేను సొంత అన్నలా ఉండేవాడిని. అపాయింట్మెంట్ లేకుండానే వాళ్ల ఇంటికి డైరెక్టుగా వెళ్లే వాడిని. ఇక చంద్రబాబునాయుడుగారు కూడా నాకు మొదటి నుంచీ ముఖ్యుడు. శ్రేయోభిలాషి’ అని ఆయన చెప్పారు. 
 
గత పదేళ్ల కాలంలో మాచర్ల, గురజాల, వినుకొండ వంటి ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని.. కాంగ్రెస్ పాలనలో ఆ ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని అన్నారు. ‘ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎంపీలకు, ముఖ్యమంత్రికి ఇబ్బంది కల్గించేలా మీరు ఎందుకు మాట్లాడతారు?’ అనే దానిపై ఆయన స్పందిస్తూ అటువంటిదేమీ లేదని.. ఎవరికీ తాను ఇబ్బంది కల్గించలేదని రాయపాటి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా తన నియోజకవర్గంలో మంచినీటి సౌకర్యం కల్గించలేకపోయానన్న బాధతోనే గతంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమేనని అన్నారు.