గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (01:43 IST)

వైఎస్ జగన్ పట్ల పవన్‌కు సాప్ట్ కార్నర్ పెరుగుతోందా: తొలిసారి వైకాపాకు అనుకూలంగా ప్రకటన

దాదాపు ఒకటన్నర సంవత్సరంగా ప్రత్యేక హోదాపై ఒంటరిపోరాటం చేస్తూ ఒంటరిగానే మిగిలిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తొలిసారిగా వైకాపాకు అనుకూలంగా ప్రకటన చేసి షాక్ కలిగించారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడానికి తనకు అనుభవం లేద

దాదాపు ఒకటన్నర సంవత్సరంగా ప్రత్యేక హోదాపై ఒంటరిపోరాటం చేస్తూ ఒంటరిగానే మిగిలిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తొలిసారిగా వైకాపాకు అనుకూలంగా ప్రకటన చేసి షాక్ కలిగించారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడానికి తనకు అనుభవం లేదని కూడా పవన్ తేల్చి చెప్పేశారు. హోదా విషయంలో ఇప్పటికే పోరాడుతున్న వైఎస్సార్సీపీతో కలిసి పనిచేసేందుకు కూడా తాను సిద్ధమని పవన్  సంచలన ప్రకటన చేశారు.
 
ప్రత్యేక హోదా, ప్యాకేజి తదితర అంశాలపై పవన్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా తదితర అంశాలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలని, ఈ విషయంలో అన్ని పార్టీలూ కలిసి పోరాటం చేయాలన్నది తన ఉద్దేశమని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే పోరాడుతున్న వైఎస్ఆర్‌సీపీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లడానికి తనకు అనుభవం సరిపోదని, అందువల్ల ఇతర పార్టీలు ముందుకొస్తే, తాను కూడా వారితో కలిసి పోరాడతానని చెప్పారు.
 
ప్రభుత్వం చేస్తున్న పనుల్లో లోపాలను చాలామంది ఎత్తి చూపించినా, మీరు వినకూడదనుకుంటే ఏం చేస్తామని, అందుకే రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందని అన్నారు. కనీసం తప్పు చేశాం.. మంచి చేద్దామనుకున్నాం కానీ పరిమితుల వల్ల చేయలేకపోయామని చెప్పకపోతే ఎలాగని ప్రశ్నించారు. గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు, నాటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ బయటకు వచ్చి, మీకు ఇష్టం లేని హిందీని మీ మీద రుద్దం అని ప్రకటించి వెళ్లిపోయారని గుర్తుచేశారు. అలాంటిది మీరు పార్లమెంటులో మాటిచ్చి.. ఇప్పుడు మాత్రం ఇవ్వం, అనుకున్నాం, కుదరదు అని మొండిగా మాట్లాడితే కుదరదని స్పష్టం చేశారు. 
 
చట్టాలు చేసేవాళ్లు కేవలం తమకే తెలివితేటలు ఉంటాయనుకుంటారని, రాష్ట్రాన్ని విడగొట్టే అంశాన్ని అన్ని సంవత్సరాలు నాన్చి.. కేవలం 12 గంటల్లో తేల్చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబుతూ, ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించేటప్పుడు దాన్ని కూడా అర్ధరాత్రి ప్రకటించడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. విభజన అనేది రాజకీయ వ్యూహం అని అర్థం చేసుకోగలమని, ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నప్పుడు.. ప్రత్యేక ప్యాకేజి అనేది ప్రత్యేక హోదాకు సమానం అన్నప్పుడు అంత హడావుడిగా ఏదో ప్రాణాలు పోతాయన్నట్లు అర్ధరాత్రి బయటకు తేవడం ఎందుకని నిలదీశారు. 
 
ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు చెప్పారని, బలంగా వాదించారని, దానికి మించింది లేదని కొన్ని సంవత్సరాలు వాదించడం వల్లే ప్రజలు దాన్ని అడుగుతున్నారని పవన్ అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఒకలా, తర్వాత మరోలా మాట్లాడితే ప్రజలకు విశ్వాసం పోతుందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నా, ప్రజా సమస్యల మీద కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని, తనది ప్రజల పక్షం తప్ప మరే పార్టీ పక్షం కాదని పవన్ అన్నారు.
 
వైకాపాకు అనుకూలంగా కాస్త ప్రకటన చేసినంత మాత్రాన పవన్ కల్యాణ్ భవిష్యత్తులో వైఎస్ జగన్‌తో చేతులు కలుపుతాడని భావించనక్కర్లేదు కానీ రాజకీయ సమీకరణాల్లో ఇంకా స్పష్టం కాని మార్పు ఏదో చోటు చేసుకుంటోందని పరిశీలకుల అంచనా.