మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (15:22 IST)

విద్యుత్ వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం!.. కొలిక్కిరాని..!?

విద్యుత్ వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేంద్ర విద్యుత్ అథారిటీ(సీఈఏ) నిర్వహించిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధికారులు తమతమ రాష్ట్రాల వాదనలు వినిపించారు. అయినప్పటికీ ఈ భేటీలో వాటాలు తేలలేదు. కృష్ణపట్నం విద్యుత్ తమదేనని ఏపీ వాదించగా, తమకూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరింది. దీంతో రాతపూర్వకంగా అభిప్రాయాలు ఇవ్వాలని సీఈఏ సూచించింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్, తూర్పుగోదావరి జిల్లాలోని సీలేరు జల విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఇచ్చేది లేదని ఆంధ్ర జెన్కో, ట్రాన్స్‌కో అధికారులు తెలంగాణకు తేల్చి చెప్పేశారు. అయితే, విభజన చట్టంలోని స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరుగారుస్తోందని, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విద్యుత్‌ను సరఫరా చేయకపోవడం దారుణమని తెలంగాణ విద్యుత్ శాఖ పేర్కొంది.
 
కాగా, వాటాల విషయంలో వచ్చే నెల మళ్లీ సమావేశమవుదామని సీఈఏ ప్రకటించింది. ఈ సమావేశంలో ఏపి తరఫున ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్యదర్శి అరవింద్ కుమార్ హాజరయ్యారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.
 
కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌ను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారని, ఇందులో తెలంగాణకు న్యాయంగా 52 శాతం వాటా వస్తుందని తెలంగాణ విద్యుత్ శాఖ సిఇఏకు తెలిపింది. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నా, బొగ్గు లింకేజి లేదనే వంకతో ఉత్పత్తి నిలిపివేశారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న సీలేరు, విభజన తర్వాత ఆంధ్రలో విలీనమైందని, ఇక్కడ జల విద్యుత్‌లో తమ వాటా ఇవ్వడం లేదన్నారు. కృష్ణపట్నంపై పీపీఏ లేదని ఏపీ విద్యుత్ శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది.