గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 24 మే 2017 (07:35 IST)

ఊయలతో సహా గాలికి కొట్టుకుని పోయి బతికి బయటపడిన నిజజీవిత బాహుబలి

ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి మృత్యుంజయుడిగా నిలిచిన బాహుబలిని మనందరం సినిమా చూసి సంతోషించాం. కానీ నిజజీవితంలో అలాంటి ఘటన జరిగితే... ఒక నెలల చిన్నారి పెనుగాలి తాకిడికి ఇంట్లో ఊయలతో సహా పైకి లేచి పోయి అల్లంత దూరానికి కొట్టుకుపోయి కూడా ప్రాణాలతో బయటపడి

ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి మృత్యుంజయుడిగా నిలిచిన బాహుబలిని మనందరం సినిమా చూసి సంతోషించాం. కానీ నిజజీవితంలో అలాంటి ఘటన జరిగితే... ఒక నెలల చిన్నారి పెనుగాలి తాకిడికి ఇంట్లో ఊయలతో సహా పైకి లేచి పోయి అల్లంత దూరానికి కొట్టుకుపోయి కూడా ప్రాణాలతో బయటపడితే.. అతడిని మృత్యుంజయ బాహుబలి అని పిలిస్తే ఏమాత్రం అతిశయోక్తి కాదు మరి. గగుర్పాటు కలిగిస్తున్న ఈ ఉదంతానికి కడప జిల్లాలోని రాజంపేట మండలం సాక్షీ భూతంగా నిలిచింది.
 
ఈ ఉదంతం కడప-నెల్లూరు రహదారిలోని రాజంపేట మండలం మందరం గ్రామపంచాయతీ కొత్తపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పెనుగాలులు వీచిన సందర్భంగా ఊయలలో  ప్రశాంతంగా నిద్రపోతున్న నెలల చిన్నారి కొట్టుకుపోయి..కేవలం స్వల్ప గాయంతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు.  బాహుబలి చిత్రంలో బాలుడు ప్రమాదం నుంచి తప్పించుకొని ఎలా బతికి బట్టకడతాడో అదే రీతిలో ప్రకృతి ప్రకోపాన్ని సైతం తట్టుకొని బతికి బయటపడ్డాడు ఓ చిన్నారి. 
 
అనంతపురం జిల్లా గుత్తి తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు మందరం కొత్తపల్లెలోని సిమెంటు ఇటుకల ఫ్యాక్టరీ ఆవరణంలోని రేకుల ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఈ వలస కుటుంబానికి చెందిన సులోచన ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం సాయంత్రం సమయంలో తన బిడ్డను రేకుల కింద కట్టిన ఊయలలో నిద్రపుచ్చి, తల్లి తన పనిలో నిమగ్నమైంది. ఈ తరుణంలో ఉన్నఫళంగా గాలి..వాన మొదలైంది. ఉన్నట్లుండి గాలి ఉధృతంగా వీచడంతో ఇంటి పైకప్పుగా వేసిన రేకులు ఒక్క ఉదుటున కొట్టుకుపోయాయి. 
 
పెను గాలుల ధాటికి రేకుల షెడ్డు కింద ఉన్న ఊయలలో ప్రశాంతంగా నిద్రపోతున్న నెలల చిన్నారి ఊయల కూడా కొట్టుకుపోయింది. ఉన్నట్లుండి ఊయల గాలికి కొట్టుకుని పోవడంతో చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ ముద్దుల బిడ్డ గాలి దెబ్బకు కొట్టుకుపోయి ఎక్కడ పడ్డాడో.. ఏమయ్యాడో..అంటూ వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. అక్కడ ఉన్న వారంతా గాలుల ప్రభావం తగ్గిన తర్వాత గాలించగా తమ నివాసాలకు కొద్ది దూరంలో రేకుల కింద పడి ఉండటం చూసి అక్కున చేర్చుకున్నారు. అప్పటికే చిన్నారి ఏడుస్తున్నాడు. చేతికి స్వల్ప గాయమైంది.
 
ఈదురు గాలులకు కొట్టుకుపోయిన తమ చిన్నారి ప్రాణాలతో ఉండటంతో కన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే చిన్నారి తల్లికి కూడా గాలులతో లేచిపోయిన రేకులు తగిలి గాయపడింది. దీంతో వెంటనే అక్కడి యువజన విభాగం తల్లీబిడ్డలకు వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఆ బాలుడు బాహుబలిలా ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి మృత్యుంజయుడిగా నిలిచాడంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు.