గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 23 నవంబరు 2014 (17:22 IST)

సమిష్టి కృషితో ఎర్రచందనం స్మగ్లింగ్ కు చెక్ : అనంతపురం ఐజీ

ప్రపంచంలోనే అరుదైన వృక్షాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లింగ్ ను సమిష్టి కృషితో అరికట్టవచ్చునని అనంతపురం రేంజీ ఐజీ వేణుగోపాల్ క్రిష్ణ అన్నారు. రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ఒంగోలు జిల్లాలలో విస్తరించి ఉన్న ఎర్రచందనం పరిరక్షణ కోసం చిత్తూరు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ - ఒక ఛాలెంజ్ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు గోపాల క్రిష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాలలో అనంతపురం మినహా మిగిలిన జిల్లాలలో ఎర్రచందనం విస్తారంగా ఉందని అన్నారు. ఇక నెల్లూరు, ఒంగోలు జిల్లాలలో పాక్షింగా విస్తరించి ఉందని తెలిపారు. అయితే దీనికి అంతర్జాతీయంగా ఉన్న గిరాకీని అనుసరించి స్మగ్లింగు పెరిగి పోయిందనీ, అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
స్మగ్లర్లు ఢిల్లీ, చెన్నయ్, ముంబయి వంటి నగరాలను కేంద్రం చేసుకుని ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు. మార్కెట్లో దీని సరఫరా పెరగడం ద్వారానే స్మగ్లింగు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం అటవీశాఖ, పోలీసు శాఖలు కలసికట్టుగా వ్యవహరిస్తే స్మగ్లింగు అరికట్టువచ్చునని చెప్పారు. 
 
ఎర్రచందనం కేసులో దోషులకు శిక్ష పడేలా న్యాయవాదులు వాదించాలని డిస్ట్రిక్ జడ్జి శ్రీకాంత్ ఆచారి అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎదుర్కుంటున్న సమస్యలకు ఈ సదస్సు మంచి పరిష్కాలను చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిఐజీ బాలక్రిష్ణ చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు, తిరుపతి ఎస్పీ గోపీనాథ్ జెట్టీ, ఫారెస్టు అధికారులు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.