శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (12:26 IST)

ఎర్ర చదువులు : స్మగ్లింగ్ లో పట్టుబడ్డ విద్యార్థులు

తిరుపతి: వారు చదువుతున్నది సాంకేతిక విద్య.. పట్టాపుచ్చుకుని టై వేసుకుని ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలోనో ఇంజనీర్ గానో, నవభారత నిర్మాణానికి ఉపయోగపడాల్సిన యువకులు రూటు మ్యాపులు చేతపట్టుకుని దొంగలకు, సంఘవ్యతిరేక శక్తులకు మార్గం చూపే పైలట్లుగాను, రవాణా చేసి పెట్టే డ్రైవర్లుగా మారుతున్నారు. చందనం స్మగ్లర్లకు అండదండగా నిలుస్తూ ఎర్ర చదువులు చదువుతున్నారు. సోమవారం తిరుపతిలో పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలలో ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులుండడం విస్మయానికి గురి చేసింది. 
 
చెన్నైకు చెందిన 24 ఏళ్ళ సురేష్ ఇంజనీరింగ్ ట్రిపుల్ విద్యార్థి. అయితే తన స్నేహితుడు నూరుల్ హుస్సేన్ పిలిస్తే స్మగ్లరకు పైలట్‌గా వ్యవహరించడానికి తిరుపతి చేరుకున్నాడు. నూరుల్ కూడా సైన్సులో డిగ్రీ హోల్డరే.. బిఎస్పీ పూర్తిచేసుకున్నాడు. వీరిద్దరు కూడా ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్టాడుతున్నారు. అన్ని తెలివితేటలు ఉన్న వీరిపై ఓ స్మగ్లర్ కన్ను పడింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి మణియన్ అనే ప్రధాన స్మగ్లరు నూరల్‌కు గాలం వేసి తన కార్యకలాపాలకు వాడుకునే వాడు. 
 
అతని ఆర్థిక స్థితిని ఆసరా చేసుకునే అతనిని పెడతోవ పట్టించారు. తిరుపతిలోని ఓ అపార్టుమెంటులో ఉన్న మణియన్ ఈ మధ్యనే ఖాళీ చేసి అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళిపోయాడు. అయితే వీరిని మాత్రం సెల్ ఫోన్ల ద్వారానే నియంత్రించేవాడు. ఇక నూరుల్ ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్‌కు గాలం వేశాడు. సురేష్ పైలట్‌లా వ్యవహరిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. 
 
రెండు నెలల కిందట ఏకంగా స్మగ్లింగ్ చేస్తూ ఓ విద్యార్థి పట్టుబడ్డాడు. కడప జిల్లాకు చెందిన తేజా రాజు అనే ఇంజనీరింగ్ విద్యార్థి హైదరాబాద్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఆయనతోపాటు ప్రసాద్, మరికొందరు విద్యార్థులు విలాసాలకు అలవాటు పడ్డారు. దీంతో వారు కార్ల దొంగతనం చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఇది ఎంతో కాలం సాగదని తెలుసుకున్న తేజా రాజు తన దారి మార్చకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలు పెట్టాడు. ముందుగా హైదరాబాద్ సమీపంలోని ఓ ట్రావెల్స్‌లో ఇన్నోవాను అద్దెకు తీసుకున్నారు. అందులో ఎర్రచందనం రవాణా చేసే వాడు.
 
నెలైనా కూడా అద్దె చెల్లించలేదు. దీంతో తేజా రాజుకు ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. కారు బెంగళూరులో మరమ్మత్తుకు గురైందని మరో కారు పంపితే తాను రెండు కార్లను లాక్కొచ్చేస్తామని నమ్మబలికారు. తన స్నేహితుల ద్వారా కారును తెప్పించుకున్నారు. చివరకు ఈ కారును కూడా ఇవ్వలేదు. దీంతో ట్రావెల్స్ వారు హైదరాబాద్ లోని సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తేజా రాజుతోపాటు మరో విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా విద్యార్థులు చదవులను పక్కన పెట్టి పెడతోవ పడుతున్నారు. సంఘ విద్రోహశక్తులను అనుసరించడం కలవరపెడుతోంది.