గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (06:44 IST)

రేవంత్ విడుదల ఆలస్యమెందుకు?... అసలేం జరిగింది..?

రేవంత్‌ రెడ్డికి బెయిలొచ్చినా ఆయన ఒక్క రోజు ఆలస్యంగా విడుదలయ్యారు. దాదాపు 24 గంటల పాటు ఆయన తాను జైలులోనే గడపాల్సి వచ్చింది. ఆయనతోపాటు సెబాస్టియన్‌, ఉదయ సింహలకు మంగళవారం ఉదయమే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా జైలులోనే ఉండిపోయారు. ఏం ఎందుకు? అసలేం జరిగింది..? 
 
ఆదేశాల ప్రతిలో సాంకేతిక లోపం కారణంగా విడుదల ఒకరోజు ఆలస్యమైంది. ‘కేసు విచారిస్తున్న ఏసీబీ స్పెషల్‌ కోర్టు సంతృప్తి మేరకు ష్యూరిటీలు ఇవ్వాలి’ అని ఉండాల్సిన చోట... ‘ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు స్టేషన్‌ సంతృప్తి మేరకు’ అని ఆదేశాల్లో ఉంది. దీనిపై కేసు విచారిస్తున్న స్పెషల్‌ కోర్టు జడ్జి అభ్యంతరం చెప్పారు. బెయిలు ఆదేశాల్లో ఉన్న సాంకేతిక లోపాన్ని సరిచేయాలని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులు బుధవారం హైకోర్టు ప్రారంభ సమయంలో న్యాయమూర్తిని కోరారు. 
 
మధ్యాహ్నం 12.30 గంటలకు న్యాయమూర్తి ఈ ఆదేశాలను సవరించారు. ఆ వెంటనే... న్యాయవాదులు హైకోర్టు బెయిల్‌ ఆర్డర్‌ కాపీని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి అందజేసి, పూచీకత్తు, రేవంత్‌ రెడ్డి పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన ఏసీబీ 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి జైలు అధికారులకు రిలీజింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 3.45కి ఈ ఆదేశాలు రేవంత్‌ తరఫు లాయర్లకు అందాయి. ఏమాత్రం ఆలస్యం కాకుండా, పరుగు పరుగున వెళ్లి ఆదేశాల ప్రతులను చర్లపల్లి జైలు అధికారుల చేతిలో పెట్టారు. అధికారులు వాటిని పరిశీలించి రేవంత్‌, సెబాస్టియన్‌, ఉదయ సింహలను సరిగ్గా... 5.25 గంటలకు బయటకు పంపారు.