గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 9 జూన్ 2015 (11:06 IST)

హైబీపీతో రేవంత్ : రేవంత్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరుకానున్న ఏపీ కేబినెట్!

ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం ఈ నెల 11వ తేదీ గురువారం జరుగనుంది. అయితే కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా బెయిల్ మంజూరు కాలేదు. ఈయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై బుధవారం విచారణ జరుగనుంది. ఒకవేళ బెయిల్ లభించక పోతే.. రేవంత్ రెడ్డి లేకుండానే ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే నిర్ణయించుకున్న నిశ్చితార్థాన్ని వాయిదా వేయడానికి అంతగా ఇష్టపడని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రమైన బాధతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి తనతో పాటు.. ఏపీ మంత్రులంతా హాజరుకావాలని నిర్ణయించారు. అలాగే, పార్టీ కీలక నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మౌఖికంగా ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రతిపాదనకు ఏపీ మంత్రులు కూడా ముక్తకంఠంతో ఓకే చెప్పారట. 
 
మరోవైపు.. ఏసీబీ కస్టడీలో ఉన్న రేవంత్ రెడ్డి అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్‌లను మంగళవారం వైద్య చికిత్సల నిమిత్తం ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, మంగళవారం సాయంత్రంతో రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీ ముగియనుంది. ఆ తర్వాత ఆయనను చర్లపల్లి జైలుకు తరలిస్తారు.