గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 జులై 2015 (12:35 IST)

రిషికేశ్వరి సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్: ప్రిన్సిపల్ ప్రమేయం కూడా ఉందట!

ఆచార్య నాగార్జున వర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రిషికేశ్వరి ఆత్మహత్యలో వర్శిటీ ప్రిన్సిపల్ ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే తన సూసైడ్ నోట్‌లో రిషికేశ్వర్ అనీషా, సీనియర్ స్టూడెంట్స్ జయచంద్రన్ మరియు శ్రీనివాస్ అనేవారు తనను వేధించారని పేర్కొంది. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రిన్సిపల్ పేరు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అందరి నోళ్ళల్లో నానుతోంది. 
 
కాలేజీ క్యాంపస్‌లో ప్రిన్సిపల్ ర్యాంగింగ్‌ను ప్రోత్సహించే వారని రిషికేశ్వరి తండ్రి ఆరోపిస్తున్నారు. ఫ్రెషర్స్ డే రోజున ప్రిన్సిపల్ బాలీవుడ్ పాటలకు సీనియర్ స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారని తెలిసింది. అయితే ఈ అభియోగాలు రావడంతో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రిన్సిపల్ గుడవల్లి బాబు రావు వెంటనే ఆ పదవిని రాజీనామా చేశారు. 
 
ఈ నేపథ్యంలో తన కుమార్తె రిషికేశ్వరి గదిని మార్పు చేయాల్సిందిగా ఆయన్ని కోరితే అందుకు ఆయన అనుమతించలేదని ఆరోపిస్తున్నారు. ఇంకా రిషికేశ్వరి వేధింపులకు గురికావడంలో ప్రిన్సిపల్ పాత్ర కూడా ఉందన్నారు. కాలేజీలో యాంటీ-ర్యాంగింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఫ్రెషర్స్ డే రోజున ప్రిన్సిపల్ డ్యాన్స్ చేయడాన్ని.. ఆ కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు కళ్లారా చూశారని కూడా రిషికేశ్వరి తండ్రి చెప్తున్నారు.