గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (11:14 IST)

రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అన్ని వేళ్లూ ప్రిన్సిపాల్ వైపే....

బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అన్ని వేళ్లూ కాలేజి ప్రిన్సిపాల్ బాబూరావువైపే చూపుతున్నాయి. ఆత్మహత్యకు ముందు.. ఆత్మహత్య తర్వాత ఆయన వ్యవహారశైలినే ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం మీడియా, విచారణ కమిటీ ఎదుట... నేను స్వాతిముత్యంలాంటివాడినంటూ చెప్పుకున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఆయననే అనుమానిస్తున్నారు. 
 
తాజాగా రిషితేశ్వరి డైరీ కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమె రాసిన వ్యాక్యాలు కూడా ఆయననే సందేహించేలా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ డే రోజు జరిగిన గొడవ గురించే రిషితేశ్వరి ప్రధానంగా డైరీలో రాసిపెట్టింది. అంతకుముందు నుంచి వేధింపులు రకరకాలుగా జరుగుతున్నా... పరాకాష్టకు చేరింది మాత్రం ఆరోజే. అక్కడ జరిగిన అవమానాల గురించే డైరీలో, సూసైడ్‌ నోట్‌లో ఎక్కువగా ఉంది. 
 
పార్టీలు చేసుకోవడానికి యూనివర్శిటీ క్యాంపస్‌లోనే ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఉంది. దాన్నికాదని దూరంగా ఉన్న రిసార్ట్‌కు ప్రిన్సిపాల్ ఎందుకు వెళ్ళారు? తాగి తందనాలాడటానికి కాకుంటే విద్యార్థుల పార్టీల కోసం రిసార్ట్‌లకు ఎందుకన్నది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న ప్రశ్న. అలా తాగిన మైకంలోనే చరణ్‌, రిషిత మీద చెయ్యి వేశాడు. దాన్నే ఆమె సీరియస్‌గా తీసుకుంది. నిబంధనలను కాదని ప్రిన్సిపల్‌ అనధికారికంగా తనకు నచ్చిన చోట పార్టీ చేయడమే విద్యార్థిని ప్రాణాల మీదికి తెచ్చిందన్నది క్యాంపస్‌ టాక్‌. పైగా.. పార్టీకి బాబూరావు తప్ప వేరే ఫ్యాకల్టీ ఎవరూ వెళ్ళలేదు. వేరే ఎవరన్నా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనన్న అభిప్రాయం కూడా లేకపోలేదు.