శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (10:39 IST)

చెత్త తొట్టెలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఫోటోలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఓ యేడాది పాటు విధులు నిర్వహించి, ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కొణిజేటి రోశయ్య ఫోటోలు.. ఇపుడు చెత్త తొట్టెల్లో దర్శనమిస్తున్నాయి. ఆయన ఫొటోలను సచివాలయంలో ఎక్కడ పడితే అక్కడ పారేశారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాలు, ఫొటోలతో సహా మీడియాలో వచ్చాయి. 
 
ఆయన చిత్రపటం చెత్తలో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయిన తర్వాత సచివాలయాన్ని కూడా రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు. ఆ తర్వాత సచివాలయంలో మరమ్మతు పనులు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గదుల్లో సామగ్రిని ఇష్టానుసారంగా బయటపడేస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే ప్రముఖుల చిత్రపటాలను కూడా కనీస గౌరవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఏకంగా ఆయన చిత్రపటాన్ని చెత్తలోనే పడేశారు. చాలా రోజులుగా ఈ చిత్రపటం చెత్తలోనే ఉన్నప్పటికీ ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. చూసిన వారు మాత్రం పాపం రోశయ్య అనుకుంటున్నారు. అత్యంత విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఖరీదైన టేకుతో తయారు చేసిన బీరువాలు, ఇతర వస్తువులు కూడా అతీగతీ లేకుండా పడిపోయి కనిపిస్తున్నాయి.