మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (16:45 IST)

చంద్రబాబుతో రైల్వే మంత్రి సదానంద భేటీ : త్వరలో 17 వేల పోస్టుల భర్తీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఇందులో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోను కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టులపై వారిద్దరు సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, రాష్ట్రంలో చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై కూడా రైల్వే మంత్రికి చంద్రబాబు వివరించారు. 
 
అంతకుముందు ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే దక్షిణ మధ్య రైల్వే సేవలు, పనితీరు మొదటి స్థానంలో ఉందన్నారు. ఇకపోతే.. రూ.5 లక్షల కోట్ల విలువ చేసే పనులు పెండింగులో ఉన్నాయన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు వీలుగా గత బడ్జెట్‌లో కొత్త వాటిని ప్రవేశపెట్టలేదన్నారు. 
 
దక్షిణ మధ్య రైల్వేలో 35 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ రైల్వే పరిధిలో రూ.21 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయన్నారు. 4,325 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైను నిర్మాణం తమ లక్ష్యమన్నారు. సురక్షిత ప్రయాణం, ప్రయాణీకుల భద్రత, నాణ్యమైన సేవలు ఈ మూడు అంశాలకే తాము ప్రాధాన్యమిస్తున్నామన్నారు. త్వరలో 17వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రైల్వేల అభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలను ఆహ్వానించామని మంత్రి సదానంద గౌడ వివరించారు.